Asianet News TeluguAsianet News Telugu

అందరూ నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలంటున్నారు.. నేను ఆమెకు మద్దతు ఇస్తున్నా..: రాజ్ ఠాక్రే సంచలనం

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. బీజేపీ సస్పెండెడ్ లీడర్ నుపుర్ శర్మకు మద్దతు తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యల్లాగే గతంలో డాక్టర్ జకీర్ నాయక్ కూడా వ్యాఖ్యానించాడని, ఆయనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయలేదని అన్నారు.

MNS chief raj thackeray supports nupur sharma over controversial commnets on nupur sharma
Author
First Published Aug 23, 2022, 4:03 PM IST

ముంబయి: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని అని గుర్తు చేసిన రాజ్ ఠాక్రే.. తాను ఆమెకు మద్దతు ఇస్తున్నానని వివరించారు. ఆయన ఈ రోజు ఇండియా టుడే మీడియా సంస్థతో మాట్లాడారు.

నుపుర్  శర్మ క్షమాపణలు చెప్పాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేశారని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఆమె ఏమైతే వ్యాఖ్యలు చేశారో.. అవే వ్యాఖ్యలను గతంలో డాక్టర్ జకీర్ నాయక్ కూడా చేశారని వివరించారు. అందుకే తాను ఆమెను సపోర్ట్ చేస్తానని చెప్పారు. జకీర్ నాయక్ ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఎవరూ క్షమాపణలు డిమాండ్ చేయలేదని అన్నారు.

అంతేకాదు, ఆయన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై విమర్శలు చేశారు. హిందూ దేవుళ్లు, దేవతలను అవమానించారని మండిపడ్డారు. అదే విధంగా తన తమ్ముడు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేను కూడా విడిచి పెట్టలేదు. 

తాను శివసేనలో ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉంటే వారికే సీఎం సీటు దక్కుతుందని అప్పట్లో బాలాసాహెబ్ నిర్ణయించారని వివరించారు. అలాంటి నిర్ణయాలను మీరెలా మారుస్తారని ప్రశ్నించారు. ఆ నిర్ణయాల మార్పు కూడా గోప్యంగా సాగడమేంటని అడిగారు. బీజేపీతో శివసేన సీఎం కుర్చీపై పేచీతో దూరమైన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని, అమిత్ షాలు పర్యటించారని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని పలుమార్లు వారు ప్రకటనలు చేశారని వివరించారు.అప్పుడు శివసేన ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు.

నుపుర్ శర్మ ఓ టీవీ చానెల్ డిబేట్‌లో నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పలుచోట్ల అల్లర్లకు దారి తీయడమే కాదు.. అరబ్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మన దేశం ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాలకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. 

నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన వారికి బెదిరింపులు రావడం గమనార్హం. ఉదయ్ పూర్ సహా పలు చోట్ల నుపుర్ శర్మకు మద్దతు తెలిపి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.

తాజాగా, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆమెకు మద్దతు పలకడం గమనార్హం. ఇదిలా ఉండగా, తెలంగాణలో బీజేపీ నేత రాజా సింగ్ కూడా మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios