తమిళనాడులో తమ పార్టీ పొత్తులపై మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత, ప్రమఖ సినీ నటుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: తమిళనాడులో తమ పార్టీ పొత్తులపై మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత, ప్రమఖ సినీ నటుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బుధవారం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కమల్ హాసన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్.. తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా 2024 పార్లమెంట్ ఎన్నికలలో డీఎంకే, ఎంఎన్‌ఎం పార్టీల మధ్య పొత్తు గురించి విలేకరులు కమల్ హాసన్‌ను ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు సమాధానమిచ్చిన కమల్ హాసన్.. తాను సీఎం స్టాలిన్ స్నేహితులమని.. ఆయనతో స్నేహం రాజకీయాలకు అతీతం అని అన్నారు. స్టాలిన్ మహానేత కుమారుడని.. ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పుడు సీఎం స్థాయికి చేరుకున్నాడని అన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదని చెప్పారు. అయితే పొత్తుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేమని అన్నారు. ‘‘పొత్తుల గురించి ఇప్పుడే చెప్పలేం. ఏ విషయాన్ని అయినా సీన్ బై సీన్ మూవ్ చేయాలి. అలాకాకుండా వెంటనే క్లైమాక్స్‌కి వెళ్లకూడదు. కథను సీన్ బై సీన్ క్యారీ చేయాలి’’ అని కమల్ పేర్కొన్నారు.
అదే సమయంలో కమల్ హాసన్ డీఎంకే మహాకూటమి వైపు మొగ్గు చూపుతున్నారా అని అడిగినప్పుడు దయానిధి మారన్ స్పందిస్తూ.. ‘‘కమల్ హాసన్ డీఎంకేకు, ఎంకే స్టాలిన్‌కు మంచి స్నేహితుడు. స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం. 2019లో చెన్నైలో మహాకూటమి ఏర్పడేలా డీఎంకే హామీ ఇచ్చింది. 2021లో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే మహాకూటమి విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 సీట్లను డీఎంకే కూటమి గెలుచుకుంటుందని మా అధినేత ధీమాతో ఉన్నారు’’ అని అన్నారు.
ఇక, మార్చి 1న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు డీఎంకే సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే స్టాలిన్ జీవిత చరిత్రను ప్రదర్శించే ఫోటో ఎగ్జిబిషన్‌తో సహా పార్టీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు ఇటీవల రాష్ట్ర మంత్రి శేఖర్ బాబు, చెన్నై మేయర్ ప్రియ.. కమల్ హాసన్‌ను ఆహ్వానించారు. ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి కమల్ హాసన్‌ను ఆహ్వానించడంతో పార్లమెంటు ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తును సూచించింది. ఈరోడ్ ఉపఎన్నికల్లో 2023లో డీఎంకే కూటమి అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్‌కు కమల్ తన మద్దతును అందించిన సంగతి తెలిసిందే.
మరోవైపు డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కూడా కమల్ హాసన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే మహాకూటమిలో కమల్ హాసన్‌కు చెందిన ఎంఎన్ఎం భాగం కాబోతుందన్న ప్రచారం సాగుతుంది. తాజాగా పొత్తులపై అంశంపై స్పందించిన కమల్ హాసన్.. అందుకు ఇంకా సమయం ఉందని చెప్పారు. కానీ డీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను మాత్రం ఆయన కొట్టిపారేయలేదు.
