న్యూ ఢిల్లీ: ఒక పొలిటికల్ ప్రేమజంట పెళ్లిపీటలెక్కబోతుంది. సాధారణంగా ఒకరు రాజకీయాల్లో ఉంటే అవతలి వ్యక్తి వేరే రంగానికి చెందినవారయ్యుంటారు. మొన్న మన అరకు ఎంపీ మాధవి రాజకీయాల్లో ఉండగా, ఆమె భర్త స్కూల్ నిర్వహిస్తున్నాడు. 

ఇంతవరకు ఒకే రంగానికి చెందిన సెలెబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం సినిమా రంగంలో మాత్రమే చూసాము. ఇప్పుడు తొలిసారి ఇద్దరు రాజకీయ సెలెబ్రిటీలు పెళ్లి చేసుకోబోతున్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ - పంజాబ్ లోని నవాన్ షహర్ ఎమ్మెల్యే అంగద్ సైనీ లు ఇద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారు. ఇద్దరూ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన వారే. 

ఐదుసార్లు ఎమ్మెల్యే అఖిలేష్ ప్రతాప్ సింగ్ కుమార్తె, అదితి 2017 లో కాంగ్రెస్ టికెట్‌పై రాజకీయాల్లోకి అడుగుపెట్టింది, తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన పేరును నిలబెడుతూ, తన సమీప ప్రత్యర్థిని 90,000 ఓట్లతో ఓడించింది. 

అదితి సింగ్ మాట్లాడుతూ, "మేము ఇద్దరం ఎమ్మెల్యేలం కాబట్టి, మా ప్రధాన బాధ్యత మా నియోజకవర్గం, అక్కడి ప్రజలు అని మాకు తెలుసు. నేను ఇప్పుడు ఎంత సమయాన్నైతే వెచ్చిస్తున్నానో, అంతే సమయాన్ని నా ప్రజలకు పెళ్లి తరువాత కూడా కేటాయిస్తాను" అని అన్నారు. 

అంగద్ కూడా రాజకీయ కుటుంబం నుంచి వచినవాడే. తండ్రి దివంగత ప్రకాష్ సింగ్  ఎమ్మెల్యేగా పనిచేసారు. అతని మామ దిల్బాగ్ సింగ్ ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.  అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన అదితి తండ్రి అఖిలేష్ సింగ్ సమక్షంలో ఈ జంటకు గత ఏడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం జరిగింది.

అంతకుముందు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 ను రద్దు చేయడాన్ని అదితి ప్రశంసించింది, ఇది కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరితో సమకాలీకరించలేదు.