- Home
- National
- Republic Day : మీ పిల్లలను రిపబ్లిక్ డే వేడుకలకు తీసుకెళ్ళాలా..? ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లోనూ టికెట్లు పొందండిలా
Republic Day : మీ పిల్లలను రిపబ్లిక్ డే వేడుకలకు తీసుకెళ్ళాలా..? ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లోనూ టికెట్లు పొందండిలా
Republic Day 2026 : మీ పిల్లలను దేశ రాజధాని న్యూడిల్లీలో అట్టహాసంగా జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు తీసుకెళ్ళాలని భావిస్తున్నారా..? అయితే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. లేదంటే ఆఫ్ లైన్ లో టికెట్లు ఎక్కడెక్కడ లభిస్తాయో తెలుసా?

రిపబ్లిక్ డే వేడుకలకు వెళ్లాలా..?
Republic Day 2026 : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 1947 ఆగస్ట్ 15న అయినా రాజ్యాంగబద్ద పాలన ప్రారంభమైంది మాత్రం 1950 జనవరి 26. మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును ప్రతిఏటా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం... దేశవ్యాప్తంగా ఘనంగా ఈ జాతీయ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. దేశ రాజధాని న్యూడిల్లీలో అయితే మువ్వన్నెల జెండా రెపరెపల మధ్య సైనిక కవాతులు... వివిధ శాఖలు, రాష్ట్రాల శకటాల ప్రదర్శనలు... సాంస్కృతిక ప్రదర్శనలు అట్టహాసంగా జరుగుతాయి.
న్యూడిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు. ఈ వేడుకలకు విదేశీ నాయకులను కూడా ఆహ్వానిస్తుంది ప్రభుత్వం. ఇలా కేవలం విఐపిలకే కాదు సామాన్య ప్రజలకు సైతం ఈ వేడుకలను కళ్లారా చూసే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. దేశభక్తిని చాటే ఈ వేడుకలకు మీ పిల్లలను తీసుకుని వెళ్లాలనుకుంటున్నారా..? అయితే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి..?
న్యూడిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టికెట్లను విక్రయిస్తున్నాయి. జనవరి 5 నుండి 14 వరకు టికెట్స్ అందుబాటులో ఉంటాయని రక్షణ శాఖ ప్రకటించింది. ఆన్ లైన్ లో అయితే www.aamantran.mod.gov.in వెబ్ సైట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
ఇక ఆఫ్ లైన్ లో అయితే న్యూడిల్లీలోని వివిధ ప్రాంతాల్లో టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. సేనా భవన్, శాస్త్రి భవన్, జంతర్ మంతర్, పార్లమెంట్ భవనం, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల టికెట్ల విక్రయిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ఓటర్, పాన్ వంటి ఐడీ కార్డులు చూపించి టికెట్ పొందవచ్చు.
రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఎంట్రీ టికెట్ ధరలు...
న్యూడిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకే కాదు తర్వాత జరిగే బీటింగ్ రీట్రీట్ కోసం కూడా టికెట్లు లభిస్తున్నాయి.
జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలు : రెండు కేటగిరీల టికెట్స్ అందుబాటులో ఉంటాయి. రూ.100, రూ.20 టికెట్లున్నాయి.
జనవరి 28 బీటింగ్ రీట్రీట్ రిహార్సల్ : టికెట్ ధర రూ.20
జనవరి 29 బీటింగ్ రీట్రీట్ : టికెట్ ధర రూ.100
రిపబ్లిక్ డే 2026 వేడుకల్లో తెలంగాణ ఒగ్గుడోలు...
ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల ద్వారా తెలంగాణ కళా ప్రదర్శన దేశానికి పరిచయం కాబోతోంది. జనవరి 26న జరిగే వేడుకల్లో తెలంగాణకు చెందిన ఒగ్గుడోలు కళాకారులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శన కోసం సిద్దిపేట, జనగామ, జగిత్యాల, వికారాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన కళాకారుల టీమ్ ను ఎంపికచేసింది ప్రభుత్వం. వీళ్లంతా ముందుగానే డిల్లీకి చేరుకుని రిహాల్సల్ చేయనున్నారు.

