MK Stalin: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలోని తమిళులకు సాయం చేయానికి కేంద్రం ప్రభుత్వ అనుమతి కోరారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్. మొత్తం 14 డిమాండ్లను ఆయన కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
MK Stalin: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఇప్పటికే దేశంలోని నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొలంబోలో వారాల తరబడి భయంకరమైన ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ప్రజలు గురువారం సాయంత్రం దాటిన తర్వాత నిరసనలకు దిగారు. ద్వీప దేశం ఎదుర్కొంటున్న భారీ ఆర్థిక సంక్షోభం మధ్య శ్రీలంకలోని తమిళులను చేరుకోవడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం కేంద్రం అనుమతి కోరారు. వారికి సాయం చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో నివసిస్తున్న తమిళులకు నిత్యావసర సరుకులు, మందులను పంపాలని తమిళనాడు సర్కారు కోరింది. కాగా, శ్రీలంక స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఇప్పటివరకు చూడని అత్యంత ఘోరమైన ఆర్థిక మాంద్యంతో పోరాడుతోంది. కొన్ని వారాల నుంచి ఆహారం, అవసరమైన వస్తువులు, ఇంధనం, గ్యాస్‌ల కొరత తీవ్రంగా ఉంది. ఇక గురువారం నుంచి దేశంలో డీజిల్ అందుబాటులోకి లేకుండా పోయింది. దాదాపు దేశంలోని 22 మిలియన్ల మంది ప్రజలు 13 గంటల విద్యుత్ బ్లాక్‌అవుట్‌లోకి జారుకున్నారు. రోడ్లపై లైట్లను నిలిపివేశారు. ఔషధాల కొరత కారణంగా ఇప్పటికే శస్త్రచికిత్సలను నిలిపివేసిన ప్రభుత్వ ఆస్పత్రులపై బ్లాక్‌అవుట్ ప్రభావం చూపింది.
"ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంక తమిళులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి. ప్రధాని ఓపికగా తమ డిమాండ్లను విన్నారు. మా డిమాండ్లపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన హామీకి ధన్యవాదాలు" అని స్టాలిన్ అన్నారు. తాను లేవనెత్తిన సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని తెలిపారు. కావేరి నదిపై కర్నాటక చేపట్టిన మాకేదాటు రిజర్వాయర్ ప్రాజెక్టుకు నో చెప్పాలని, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని, సెస్‌పై వాటా, జీఎస్టీ పరిహారం కొనసాగింపు, వివిధ పారిశ్రామిక, రవాణా మరియు ప్రాజెక్టుల కోసం కేంద్రం మద్దతు వంటి 14 డిమాండ్లను తమిళనాడు ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి చేశారు.
దేశంలో మూడవ అతిపెద్ద పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న డిఎంకె చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్..ఇప్పుడు సామాజిక న్యాయం మరియు సమాఖ్య వాదం కోసం జాతీయ పాత్రను పోషిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కూడా కాంగ్రెస్ ఇటీవలి ఎన్నికల ఓటమి తర్వాత ప్రతిపక్ష నాయకులు సోనియా గాంధీ, మమతా బెనర్జీ, వామపక్ష నేతలు మరియు అనేక మందిని కలిపేసింది. డీఎంకే పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కనిమొళి ఎన్‌విఎన్ సోము మీడియాతో మాట్లాడుతూ.. "అతను (స్టాలిన్) ఎప్పుడూ ప్రజల కోసం కష్టపడ్డాడు, మనం అతన్ని ప్రధాని అభ్యర్థిగా ఎందుకు భావించకూడదు? అందులో తప్పు ఏముంది? "అంటూ వ్యాఖ్యానించారు. వరుస ఎన్నికల్లో తిరుగులేని విజయంతో ముందుకు సాగుతున్న స్టాలిన్.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే విధంగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకం చేయడమే పెద్ద సవాలు అని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
