మిషన్ అమృత్ సరోవర్‌ లక్ష్యాన్ని సాధించడంలో తెలంగాణ వెనుకబడింది. తెలంగాణతోపాటు మరో ఏడు రాష్ట్రాలూ వెనుకబడ్డాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. 

న్యూఢిల్లీ: మిషన్ అమృత్ సరోవర్‌లో దేశం టార్గెట్ రీచ్ అయింది. కానీ, ఇందులో తెలంగాణ వెనుకబడింది. తెలంగాణతోపాటు మరో ఏడు రాష్ట్రాలు లక్ష్యాన్ని అందుకోలేకపోయావని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

జిల్లాకు 75 అమృత్ సరోవర్‌లను ఏర్పాటు చేయడం లేదా ఉన్నవాటిని పునరుజ్జీవనం గావించండం(చెరువులు, సరస్సులు, కొలనులను డెవలప్‌చేయడం) అనే లక్ష్యాన్ని ఛేదించడానికి అన్ని రాష్ట్రాలు తమ ప్రయత్నాలు చేశాయి. కేవలం ఎనిమిది రాష్ట్రాలు మినహా దేశం ఈ టార్గెట్ రీచ్ కాగలిగిందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఎనిమిది రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హర్యానా, బిహార్, రాజస్తాన్‌లు వెనుకబడ్డాయని వివరించింది. ఈ రాష్ట్రాలు జిల్లాకు 75 చొప్పున అమృత్ సరోవర్‌ల లక్ష్యాన్ని సాధించలేకపోయాయని తెలిపింది.

దేశవ్యాప్తంగా 1,12,277 అమృత సరోవర్‌లను గుర్తించారు. ఇందులో 81,425 వాటర్ బాడీల కోసం పని ప్రారంభించారు. ఇందులో 66,278 సరోవర్‌ల పనులు పూర్తయ్యాయి. అంటే.. నిర్మించడం గానీ, లేదా మెరుగులు దిద్దడం వంటివి చేయడం.

Also Read: ఎల్బీ నగర్‌లో గిరిజన మహిళపై పోలీసుల దాడి: ఇద్దరిని సస్పెండ్ చేసి సరిపెట్టారు: ఈటల రాజేందర్

2022 ఏప్రిల్ 24వ తేదీన ప్రధాని మోడీ ఈ మిషన్ ప్రారంభించారు. ఈ మిషన్ కోసం ఎనిమిది కేంద్ర మంత్రిత్వ శాఖలు సమన్వయంతో కలిసి పని చేశాయి. ఈ మిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కాకుండా ఇతర కేంద్ర కార్యక్రమాలనూ వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు వాటర్షెడ్ డెవలప్‌మెంట్ కంపోనెంట్, హర్ ఖేత్ కో పానీ వంటి కార్యక్రమాలనూ ఈ మిషన్‌లో భాగం చేసుకోవచ్చు.