డెహ్రాడూన్: నలుగురు కుటుంబ సభ్యులు ఏడాది క్రితం కనిపించకుండా పోయారు. అయితే, వారింట్లోనే వారు అస్తిపంజరాలై తేలారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ తీవ్ర సంచలనం రేపింది. ఉద్దామ్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన హీరాలాల్, అతడి భార్య, ఇద్దరు కూతుళ్లు నిరుడు ఏప్రిల్ లో అదృశ్యమయ్యారు. 

 మామతో పాటు ఆయన కుటుంబ సభ్యుల డెత్ సర్టిఫికెట్ల కోసం హీరాలాల్ అల్లుడు నరేంద్ర గాంగ్వర్ తన మిత్రుడు దుర్గాప్రసాద్ ను ఇటీవల సంప్రదించాడు. దాంతో దుర్గా ప్రసాద్ కు అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాడు.

పోలీసులు నరేంద్ర గాంగ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. తన మామకు చెందిన 12 బిగాల భూమి కోసం తాను వారిని హత్య చేసినట్లు అంగీకరించాడు. తన మిత్రుడు విజయ్ గాంగ్వర్ తో కలిసి ఇంటి ఆవరణలోనే వారి శవాలకు నిప్పు పెట్టినట్లు చెప్పాడు. 

ఈ వ్యవహారంలో తన భార్య, హీరాలాల్ పెద్ద కూతురు కూడా సహకారం అందించినట్లు నరేంద్ర గాంగ్వర్ చెప్పాడు. నరేంద్ర గాంగ్వర్, అతనికి సహకరించిన విజయ్ గాంగ్వర్, నరేంద్ర గాంగ్వర్ భార్యలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.