ఒడిశాలో మైనర్ బాల, బాలికలకు రెండు కుక్కలతో పెళ్లి చేశారు. అబ్బాయికి ఆడ కుక్కతో, అమ్మాయికి మగ కుక్కతో పెళ్లి చేశారు.
బాలాసోర్: మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు ఇంకా పలు చోట్ల కొనసాగుతున్నాయి. తాజాగా ఒడిశాలో ఇది బయటపడింది. పిల్లలకు పాల దంతాలు మొదటా పై దవడకు వస్తే.. దాన్ని అరిష్టంగా అక్కడి ఓ కమ్యూనిటీ భావిస్తుంది. అది దుష్ట శక్తుల నుంచి ముప్పును సూచిస్తుందని నమ్ముతుంది. అందుకే ఆ దుష్ట శక్తుల నుంచి సురక్షితంగా ఉండాలంటే ఆ మైనర్లు కుక్కలను పెళ్లాడాలని కొన్ని తరాల నుంచి ఓ మూఢ ఆచారం వస్తున్నది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సోరో బ్లాక్‌లోని బందసాహి గ్రామంలో హో ట్రైబల్స్ ఉన్నారు. ఈ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన దారి సింగ్‌కు 11 ఏళ్ల కొడుకు తపన్ సింగ్ ఉన్నాడు. అదే కమ్యూనిటీకి చెందిన బుతుకు ఏడేళ్ల కూతురు లక్ష్మీ ఉన్నది. తపన్ సింగ్‌కు ఆడ కుక్కతో, లక్ష్మీకి మగ కుక్కతో పెళ్లి జరిపించారు. ఇలా చేసి దుష్ట శక్తులను కట్టడి చేసినట్టుగా వారు భావిస్తున్నారు.
పిల్లలకు పై దవడకు పళ్లు వస్తే ఇలా చేయాలని తరాలుగా ఆ కమ్యూనిటీ వారు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రెండు పెళ్లిళ్లు జరిపించినట్టు ఈ గ్రామానికి చెందిన 28 ఏళ్ల గ్రాడ్యుయేట్ సాగర్ సింగ్ వివరించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్రతువులు జరిగాయని తెలిపారు. కమ్యూనిటీకి విందు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు.
ఇలా పెళ్లి చేయడం ద్వారా దుష్ట శక్తులు మనుషుల నుంచి కుక్కలపైకి వెళ్లిపోతాయని వారు భావిస్తున్నారు. దీనికి శాస్త్రీయత లేకున్నా.. తరాలుగా పెద్దలు పాటిస్తున్నారని గౌరవించడం అని ఆ స్టూడెంట్ తెలిపారు.
