ఓ విద్యార్థిని షాపింగ్ కి వెళ్లి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మూడు నెలలపాటు ఓ ఇంట్లో బంధించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె తప్పించుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

జార్ఖండ్ : జార్ఖండ్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.16 ఏళ్ల 9వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి, గదిలో బంధించి, దాదాపు మూడు నెలల పాటు ముగ్గురు వ్యక్తులు కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు సోమవారం వివరాలు తెలిపారు. నిందితులను మంటోష్, విష్ణుకుమార్, మనోజ్ కుమార్‌లుగా బాధితురాలు గుర్తించింది. అయితే వారు తనకు అంతకు ముందు తెలియదని ఎఫ్‌ఐఆర్‌లో బాధితురాలు పేర్కొంది.

ఏప్రిల్ 19న ఆమె కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు అంతా వెతికిన తరువాత ఏప్రిల్ 20న స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆమె తిరిగి వస్తుందని, వేచి ఉండమని కోరారు. సోమవారం, DSP కుల్దీప్ కుమార్ మాట్లాడుతూ, "ముగ్గురు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత, దర్యాప్తు ప్రారంభించాం. బాలికకు వైద్య పరీక్షల కోసం పంపించాం. ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా త్వరలో కోర్టు ముందు నమోదు చేస్తాం" అని తెలిపారు. పోలీస్ విచారణలో నిందితులను గుర్తించిన తర్వాత.. వారిని పట్టుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిపై పోక్సో చట్టం, ఐపీసీలోని వివిధ సెక్షన్‌ల కింద కేసులు పెట్టారు.

దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. రూ. 5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ నేత హతం..

ఈ ఘటనను బాలిక కుటుంబసభ్యులు వివరిస్తూ... ‘బాలిక ఏప్రిల్ 19న షాపింగ్‌కి వెళ్లింది. బట్టలు కొనుక్కొని తిరిగి వస్తుండగా, నిందితులు ముగ్గురు కలిసి ఆమెను బలవంతంగా ఆటోరిక్షాలోకి ఈడ్చుకెళ్లి.. అరవకుండా నోటికి బట్ట కట్టి.. కిడ్నాప్ కు పాల్పడ్డారు. ఆ తరువాత ఆమెను తెలిదిహ్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లి గదిలో బంధించారు. నిందితులు బయటికి వెళ్లినప్పుడల్లా గదికి తాళం వేసి.. ఆమె అరవకుండా నోటికి బట్ట కట్టేవారు. బయటి నుంచి భోజనం తెచ్చేవారు. 

ఇలా, మూడు నెలలు గడిచిన తరువాత జులై 19న ఆ ఇంటి పొరుగున నివాసముంటున్న ఓ మహిళ బాలికను చూసి తాళం పగులగొట్టింది. దీంతో ఆమె తప్పించుకోగలిగింది. అక్కడినుంచి ఇంటికి చేరుకున్న బాలిక.. తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని భోరున ఏడుస్తూ చెప్పింది. దీంతో ఆదివారం, కుటుంబ సభ్యులు బాలికతో పాటు బొకారో మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో నిందితుల మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)