కరోనా వ్యాక్సిన్ తయారికి ప్రయోగాలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు.
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు.
శుక్రవారం నాడు దేశంలోని పలు రాష్ట్రాల వైద్య,ఆరోగ్య శాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నామన్నారు మంత్రి.
కరోనా వైరస్ ను నిరోధించేందుకు వ్యాక్సిన్ తయారు చేయడంలో మన దేశం కూడ ప్రయోగాలు చేస్తోందన్నారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్పరెన్స్ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
సోషల్ డిస్టెన్స్ తో పాటు లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన ఆయా రాష్ట్రాల మంత్రులను కోరారు.కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేవరకు వీటిని పాటించాలని ఆయన సూచించారు.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రక్షణ చర్యలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.పలు రాష్ట్రాల ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించడం లేదన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు తమ తమ రాష్ట్రాల్లో 100 శాతం లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆయన కోరారు.కేంద్రం 15 వేల కోట్ల ప్యాకేజీని కరోనా బాధిత రాష్ట్రాలకు అందించనుందన్నారు.
కరోనా ను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ కింద అన్ని రాష్ట్రాలకు సుమారు రూ. 4100 కోట్లను అందించనున్నారు.కరోనాను ఎదుర్కొనేందుకు డబ్బులు సమస్య కాకూడదనేది తమ అభిమతమన్నారు. ఒక్క రాష్ట్రాన్ని మించి మరో రాష్ట్రం మంచి పద్దతులను అవలంభిస్తూ ఈ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
Also read:ఇండియాలో 24 గంటల్లో 678 కొత్త కేసులు, 199 మంది మృతి
కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెబ్ సైట్ ను ఆయా రాష్ట్రాల అధికారులు ప్రతి రోజూ చూస్తూ కేంద్రం ఇస్తున్న గైడ్ లైన్స్ ను అమలు చేయాల్సిందిగా ఆయన కోరారు.
గర్భిణీలు, అప్పుడే పుట్టిన శిశువులు కరోనా కారణంగా ఇబ్బందిపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన మంత్రులను కోరారు. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న జిల్లాల్లో ఈ రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేకమైన ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సూచించారు.