అవసరమైతే జిల్లా స్థాయిలో ఆంక్షలు విధించండి.. ఒమిక్రాన్ దృష్ట్యా రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ లేఖ
ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాటించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) లేఖ రాసింది.
ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాటించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) లేఖ రాసింది. మహమ్మారిని అరికట్టడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని, పండగల సీజన్‌లో అవసరం ఆధారంగా ఆంక్షలు విధించాలని కోరింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల అమలు కోసం హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ చట్టం కింద చట్టబద్ధమైన ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
‘దేశం మొత్తం కోవిడ్ యాక్టివ్ కేసుల క్షీణతను చూసింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే కంటే కనీసం 3 రెట్లు ఎక్కువ వ్యాప్తి చెందగలదని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది కోవిడ్ నియంత్రణ చర్యలకు కొత్త సవాలు విసురుతోంది. ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల్లో కేసుల వృద్ది చాలా వేగంగా జరుగుతుంది. మన దేశంలో, 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే 578 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి’ అని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా (Ajay Bhalla ) అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
డిసెంబర్ 21న ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించాలని ఈ లేఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా.. దూరదృష్టితో వ్యవహరించాలని, డేటా విశ్లేషణ, వేగంగా నిర్ణయం తీసుకోవడం అవసరమని పేర్కొంది. అంతేకాకుండా స్థానిక, జిల్లా స్థాయిలలో కఠినమైన, తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
‘కొత్త వేరియంట్ వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి రాష్ట్రాలలో ఉన్న ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉందనే విషయాలన్ని ప్రభుత్వాలు నిర్దారించుకోవాలి. ఆక్సిజన్ సరఫరా, అవసరమైన మందుల బఫర్ స్టాక్‌ను కూడా నిర్వహించాలి’ అని కోరారు.
‘116 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యుఎస్, యుకె, యూరప్ (ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్), రష్యా, దక్షిణాఫ్రికా, వియత్నాం, ఆస్ట్రేలియా మొదలైన ప్రదేశాలలో పెరుగుదల ఎక్కువగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు పాటించాలి. స్థానిక, జిల్లా పరిపాలన విభాగం.. పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా, తక్షణమే తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలి. పండుగ సీజన్‌లో రద్దీని నియంత్రించేందుకు రాష్ట్రాలు అవసరాల ఆధారంగా.. స్థానిక పరిమితులు విధించవచ్చు’ అని పేర్కొన్నారు. ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్- కోవిడ్ నిబంధనలు కట్టుబడి ఉండటం’ అనే పంచముఖ వ్యూహంపై దృష్టిని కొనసాగించాలని తెలిపారు.
రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని లేఖలో పేర్కొంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం తప్పనిసరి చేసింది. అవసరమైతే 144 సెక్షన్ ప్రయోగించాలని తెలిపింది. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడాన్ని నిషేధించింది. బహిరంగ ప్రదేశాలు, సమావేశాల్లో భౌతిక దూరం పాటించాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.