భారతదేశంలో మంకీపాక్స్ కేసులు నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యసవర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 

ప్రస్తుతం ప్రపంచాన్ని కలరపెడుతోన్న మంకీపాక్స్ (Monkeypox) తాజాగా భారత్‌లోనూ చాపకింద నీరులా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (ministry of health and family welfare) మంకీపాక్స్‌పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో మంకీపాక్స్‌కు ఎలా అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. 

ఇకపోతే... దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం రేపింది. 31ఏండ్ల‌ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ రోగిని ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చేర్చారు. మంకీపాక్స్ సోకిన వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ లోని ప‌లు ప్రాంతాల‌ను సంద‌ర్శించిన‌ట్టు గుర్తించారు. కానీ, అతనికి విదేశీ ప్రయాణం చేసిన చరిత్ర లేదు. భారతదేశంలో ఇప్పటి వరకు 4 మంకీపాక్స్ కేసులను అధికారులు గుర్తించారు. ఢిల్లీలో 1 కేసు, కేరళలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. మంకీపాక్స్ విజృంభ‌ణను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్యూహెచ్ ఓ) శనివారం ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

75 దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తి

ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలకు మంకీపాక్స్ వ్యాపించడం గమనార్హం. ఇప్పటి వరకు 16 వేల కోతుల వ్యాధి కేసులు నమోదయ్యాయి. ఐరోపాలో మంకీపాక్స్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా న‌మోదైన మంకీపాక్స్ కేసుల్లో 80 శాతం కేసులు ఐరోపాలోనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో మంకీపాక్స్ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీగా ప్రకటించింది. వేగంగా పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ టాడ్రాయిడ్ అబ్రహం మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించారు.

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది?

ఈ వ్యాధి గురించి ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈశ్వర్ గిలాడా మాట్లాడుతూ.. మంకీపాక్స్ వైర‌స్ ఇతర లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ లాంటిదేనని చెప్పారు. మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తికి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. మంకీపాక్స్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌. మంకీపాక్స్ అనేది మశూచిని పోలి ఉండే వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఎలుకలు , ముఖ్యంగా కోతుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ప్రస్తుతం దాదాపు 99% కేసులు స్వ‌లింగ సంప‌ర్కం( మ‌గ‌- మ‌గ‌) వ‌ల‌న వ్యాప్తి చెందుతుంది. దాదాపు 80% కేసులు యూరప్, ఆ తర్వాత US, కెనడా, ఆస్ట్రేలియా , ఇతర దేశాల్లో న‌మోద‌య్యాయి. మంకీపాక్స్ ప్రధానంగా.. వ్యాధి సోకినవారితో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు.

మంకీపాక్స్ ఎలా నివారించాలి?

కోతుల వ్యాధి నివారణ, చికిత్సకు సంబంధించి డాక్టర్ ఈశ్వర్ గిలాడ మాట్లాడుతూ.. ప్రస్తుతం మంకీపాక్స్ సరైన చికిత్స లేదని తెలిపారు. చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ద్వారా మంకీపాక్స్‌ను నివారించవచ్చు. మంకీపాక్స్ వ్యాధికి చికిత్స చేయడానికి ఇది ఒక చికిత్సా ఏజెంట్‌గా పని చేస్తుంది. కాబట్టి ఉపయోగకరంగా ఉండవచ్చు. దీనిని నివారించడానికి త‌గు జాగ్రత్తలు తీసుకోవాలి, కోతి వ్యాధితో బాధపడుతున్న రోగిని సంప్రదించకూడదని, అలాగే, దాని వ్యాప్తికి ఇచ్చిన కారణాలను చేయవద్దు. ఇది కాకుండా.. సోకిన వ్యక్తి ఉపయోగించే అన్నివస్తువులకు దూరంగా ఉండటం ద్వారా మంకీపాక్స్ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.

మంకీపాక్స్ లక్షణాలు ఏమిటి?

మంకీపాక్స్ లక్షణాలు మశూచి రోగులలో కనిపించే మాదిరిగానే ఉంటాయి. శరీరం అంతటా ముదురు ఎరుపు దద్దుర్లు, న్యుమోనియా, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, అధిక అలసట, అధిక జ్వరం, చలి, శరీరంలో వాపు, శక్తి లేకపోవడం దీని ప్రారంభ లక్షణాలు.