అగ్నిపథ్ పథకంపై యువతలో వున్న అపోహలను తొలగించేందుకు కేంద్ర రక్షణ శాఖ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా ఆదివారం త్రివిధ దళాలకు చెందిన అధికారులు మీడియా ముందుకు వచ్చారు. 

అగ్నిపథ్‌పై (agnipath scheme) దేశవ్యాప్తంగా అల్లర్ల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (rajnath singh).. త్రివిధ దళాధిపతులతో పలుమార్లు చర్చలు జరిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం త్రివిధ దళాలకు చెందిన అధికారులు మీడియాకు తెలియజేశారు. 1989 నుంచి అగ్నిపథ్ పెండింగ్‌లో వుందని.. సైన్యంలో సగటు వయస్సును తగ్గించేందుకే సంస్కరణలు చేపట్టినట్లు వారు తెలిపారు. బలగాల్ని యువకులతో నింపాలన్నదే అగ్నిపథ్ లక్ష్యమని చెప్పారు. కొత్త టెక్నాలజీని యువత త్వరగా అందిపుచ్చుకుంటోందని తెలిపారు. అగ్నిపథ్‌పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారని వారు చెప్పారు. 

యువత సైన్యంలోకి రావటానికి, వెళ్లిపోవటానికి అవకాశాలు పెంచామని తెలిపారు. అనుభవం, యువశక్తికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. సెల్‌ఫోన్‌లు, డ్రోన్లతో యువకులు అద్బుతాలు చేస్తున్నారని వారు ప్రశంసించారు. యువ సైనికులు అయితే సైన్యంలో టెక్నాలజీని సమర్ధంగా వినియోగిస్తారని భావించామన్నారు. అగ్నివీర్‌లు సైన్యంలో కొనసాగేందుకు అవకాశాలు వున్నాయని.. కోవిడ్ వల్ల గడిచిన రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు జరగలేదని వారు తెలిపారు. ఈసారి ఎక్కువ మందిని నియమించుకోవాలని భావిస్తున్నామని.. మూడు విభాగాల్లో ఏటా 17,600 మంది ముందస్తు రిటైర్‌మెంట్ అవుతున్నారని చెప్పారు. 

అగ్నివీర్‌లకు ఇచ్చే అలవెన్సుల్లో ఎలాంటి తేడాలు వుండవని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టం చేశారు. పాతికేళ్ల వయసులో ఆర్మీ నుంచి బయటకొస్తే వాళ్లకు నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని ఆయన అన్నారు. ఒకవేళ అగ్నివీర్‌లు ప్రాణాలు కోల్పోతే రూ.కోటి పరిహారం అందుతుందని అనిల్ పురి చెప్పారు. సర్వీసు నిబంధనల్లో అగ్నివీర్‌ల విషయంలో వివక్ష వుండదని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్ల తర్వాత కొనసాగాలా వద్దా అనేది యువత ఇష్టమని.. నాలుగేళ్ల తర్వాత డిప్లొమా ధ్రువపత్రం ఇస్తామని అనిల్ పురి వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత కూడా యువతకు అనేక రంగాల్లో అవకాశాలు వుంటాయని ఆయన పేర్కొన్నారు. 

పాతికేళ్ల తర్వాత ఆర్మీ నుంచి బయటకు వచ్చే వాళ్లకు బ్రిడ్జి కోర్సులో శిక్సణ ఇస్తామని అనిల్ పురి వెల్లడించారు. అగ్నిపథ్ సర్వీసును పూర్తి చేసిన వాళ్లు పోలీస్ ఉద్యోగాలకు అర్హులని ఆయన తెలిపారు. పోలీస్ విభాగంలోకి తీసుకోవడానికి 4 రాష్ట్రాలు సిద్ధంగా వున్నాయని.. అగ్నివీరులు ఎంతగానో ఉపయోగపడతారని సీఐఐ స్పష్టం చేసిందని అనిల్ పురి గుర్తుచేశారు. ఈ నెల 24 నుంచి వాయుసేనలో నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. డిసెంబర్ ఆఖరు నాటికి అగ్నివీర్ తొలి బ్యాచ్ సిద్ధమవుతుందన్నారు. నావికాదళంలో ఖాళీల భర్తీపై ఈ నెల 25 వరకు ప్రకటనలు ఇస్తామని తెలిపారు.