మంత్రి సెంథిల్ బాలాజీకి తీవ్ర అస్వస్థత.. జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు..
మనీ లాండరింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మంత్రి సెంథిల్ బాలాజీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు.

చెన్నై : మంత్రి సెంథిల్ బాలాజీ సోమవారం నాడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో అరెస్టై, రిమాండ్ ఖైదీగా పుళల్ కేంద్ర కారాగారంలో ఉంటున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉన్నట్టుండి అస్వస్థతకు గురవడంతో మొదట ఆయనను జైలులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం.. రాయపురంలోని ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. జైలు నుంచి ఆసుపత్రికి.. ఆసుపత్రి నుంచి జైలుకి తరలించే క్రమంలో పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. సెంథిల్ బాలాజీ ప్రస్తుతం పుళల్ కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. మంత్రి సెంథిల్ బాలాజీకి నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ జరిగింది.
షోపియాన్ లో ఎన్ కౌంటర్.. కాశ్మీర్ పండిత్ హత్య కేసులో ఉగ్రవాది సహా మరొకరు హతం..
ఆ సమయంలో కూడా ఆయన జైలులోనే ఉన్నారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తీసుకువచ్చిన సిబ్బంది.. ఆయనను ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు సెంథిల్ బాలాజీకి కాళ్లలో వాపు కనిపించింది. కంగారుపడిన ఆయన వెంటనే విషయాన్ని జైలు సిబ్బంది ద్వారా అధికారులకు చేరేలా చేశారు.
ఈ సమాచారంతో అప్రమత్తమైన జైలు అధికారులు.. జైలులో అందుబాటులో ఉన్న వైద్యులతో పరీక్షలు చేయించారు. అయితే ఆయన కాళ్లకు ఎలాంటి స్పర్శ లేదని తేలింది. దీంతో వెంటనే ఆయనను రాయపురంలోని ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 6:30 గంటలకు చేరుకున్న తర్వాత.. ఎకో, ఈసీజీ, రక్తపోటు లాంటి పరీక్షలు చేశారు.
ఈ పరీక్షలన్నీ చేసిన తర్వాత ప్రాథమిక చికిత్స చేసి తిరిగి జైలుకు పంపించారు. మంత్రి ఆరోగ్య పరిస్థితి మీద ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఈమెరకు వివరాలు తెలిపారు. మంత్రి సెంథిల్ బాలాజీకి రక్తపోటు సమస్య ఉంది. కాళ్ల వాపు రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారని.. ఆయనకు వివిధ పరీక్షలు చేసి, ప్రాథమిక చికిత్స చేసినట్లు చెప్పుకొచ్చారు.