మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళలపై జరిగిన దాష్టీకం పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఇలాంటి ఘటనలు విపక్ష రాష్ట్రాల్లోనూ చోటుచేసుకుంటున్నాయని అన్నారు. కానీ, అవి మణిపూర్ ఘటననే రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. 

న్యూఢిల్లీ: మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా కొట్టుకుంటూ రోడ్డుపై తీసుకెళ్లి.. గ్యాంగ్ రేప్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మే 4వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యం వీడియో వైరల్ కావడంతో బయటకు వచ్చింది. ఇంటర్నెట్ బ్యాన్ చేసిన కాలంలో ఇంకెన్ని దుశ్చర్యలు మరుగున ఉన్నాయో అనే ఆరోపణలు, వాదనలు వచ్చాయి. దీంతో రాష్ట్రం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రధాని మోడీ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే, తాజాగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్షాలపై దాడి చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి ఘటనలు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ చోటుచేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ హెడ్‌క్వార్టర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజస్తాన్, బిహార్, పశ్చిమ బెంగాల్‌లోనూ మహిళలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజస్తాన‌లో గత నాలుగేళ్లలో సుమారు లక్షల కేసులు మహిళలపై దాడులకు సంబంధించినవి రిపోర్ట్ అయ్యాయని తెలిపారు. అందులో సుమార 33 వేల వరకు ప్రత్యేకించి లైంగిక నేరాలకు సంబంధించినవేనని వివరించారు.

Also Read: దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ.. 100 రోజుల ఆందోళనలకు ప్లాన్.. బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే టార్గెట్!

రాజస్తాన్‌లోని అశోక్ గెహ్లట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గంలోని సభ్యుడే తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో కాదు.. ముందు మీ రాష్ట్రంలో చూసుకోండని కటువుగా కామెంట్ చేశారు. దీంతో రాజస్తాన్ మంత్రి రాజేంద్ర గూదకు ఉద్వాసన పలికారు. ఈ అంశంపై అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. రాజస్తాన్‌లో మహిళలపై నేరాల గురించి రాజేంద్ర గూద మాట్లాడినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆదేశాలతో అశోక్ గెహ్లాట్ ఆ మంత్రిని బర్తరఫ్ చేశారని ఆరోపణలు చేశారు.