దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ.. 100 రోజుల ఆందోళనలకు ప్లాన్.. బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే టార్గెట్!
తెలంగాణ బీజేపీ ఆందోళనలు ఉధృతంగా చేపట్టనుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో మొత్తం 100 రోజుల ఆందోళన కార్యక్రమాలకు ప్లాన్ వేసింది. రేషన్ కార్డుల జారీ, రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు డిమాండ్లు ప్రధానం చేసుకుని ఈ నిరసనలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: వ్యవస్థాగత మార్పులు పూర్తి చేసుకున్న తెలంగాణ బీజేపీ వేగంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని, అందుకోసమే విస్తృత ఆందోళనలకు ప్రణాళికలు వేస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణ బీజేపీ భారీగా ఆందోళనలు చేయాలని నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ 100 రోజుల ఆందోళనల కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నది. తెలంగాణ బీజేపీ మొత్తం 100 రోజుల నిరసనల కార్యక్రమాల్లోనే మునిగి తేలనుంది.
ఈ నిరసనల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ జులై 24వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల గురించి ఆందోళనలు చేయనుంది. ఆ తర్వాత 25వ తేదీన ఇదే అంశంపై హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపట్టనుంది.
ఈ రోజు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ముఖ్యమైన సమావేశం జరిగింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జీ ప్రకాశ్ జవడేకర్, ఇంచార్జీ సునీల్ బన్సల్‌లు శనివారం ఉదయం సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేయడానికి, ఎన్నికల వ్యూహం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి అభిప్రాయాలు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ జెడ్పీ చైర్మన్లు, మాజీ మేయర్లు, సివిల్ సర్వెంట్లుగా చేసిన బీజేపీ నేతల నుంచి ఈ అభిప్రాయాలు వారు స్వీకరించారు.
రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఉద్యమాలను ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రేషన్ కార్డుల జారీ, రైతుల రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు ప్రధాన డిమాండ్లు గా ఈ ఆందోళనలు జరగనున్నాయి. దళితులకు కేటాయించిన భూములను కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నదని బీజేపీ అనుమానిస్తున్నది. ఈ విషయం పైనా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకు న్నట్టు సమాచారం.