ఇటీవల బిహార్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై కన్నేశాడు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా.. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో కలిసి పోటీ చేయడానికి ఎంఐఎం ముందుకు వచ్చింది.

ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రతిపాదించారు. పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లోనూ తన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్లు ఒవైసీ ప్రకటించారు. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణా జిల్లాలపై ఒవైసీ దృష్టిసారించారు. ఈ ఐదు జిల్లాల్లో సుమారు 60కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

బెంగాల్‌ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీని తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ ఓటు బ్యాంకుకు ముప్పుగానే భావిస్తోంది. బిహార్‌ ఎన్నికల్లో సంచలనంగా మారిన మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో, బెంగాల్‌లో తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను ఒవైసీ తన వైపు తిప్పుకుంటారని టీఎంసీ, కాంగ్రెస్‌లకు ఆందోళన మొదలైంది. 

పశ్చిమ బెంగాల్‌లో 24 శాతం బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉండగా, 6 శాతం హిందీ మాట్లాడే ముస్లింలు ఉన్నారు. వాస్తవానికి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీల మ«ధ్యే జరగనుంది. అదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు సైతం మమతాతో పోరాడుతున్నాయి. ఇలాంటి త్రికోణ పోటీ మధ్యలో, ఎంఐఎం దీటైన అభ్యర్థులతో బెంగాల్‌ ఎన్నికల బరిలో దిగితే, బిహార్‌లో మహాకూటమి మాదిరిగా మమతా బెనర్జీ  ప్రత్యక్ష నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని టీఎంసీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.