ఉత్తరాఖండ్ కమిటీ రూపొందించిన యూసీసీ ముసాయిదా రాజ్యాంగంలోని ఆర్టికల్ 44ను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని ఏఐఎంఐఎం నేత ఒవైసీ పేర్కొన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ అంటే.. మైనార్టీలపై మెజారిటీ వర్గాల అభిప్రాయాలను రుద్దడమేనని అన్నారు.    

దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ పై చర్చ జరుగుతోంది. పార్లమెంట్ శీతకాలం సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో AIMIM చీఫ్,ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో స్పందించారు. రిటైర్డ్ జస్టిస్ గోపాల్ గౌడ న్యాయపరమైన అభిప్రాయంతో పాటు మా ప్రతిస్పందనను లా కమిషన్‌కు పంపామని అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం (జూలై 14) విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ప్రతిస్పందనను సిద్ధం చేయడంలో సుప్రీంకోర్టు న్యాయవాది నిజాం పాషా సహకరించారని ఆయన చెప్పారు.

లా కమిషన్ నోటిఫికేషన్‌పై అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నలు సంధించారు. నోటిఫికేషన్‌లో లా కమిషన్ ప్రజల అభిప్రాయాలను కోరిందని, ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదన్నారు. ఐదేళ్ల తర్వాత యూసీసీపై లా కమిషన్ మళ్లీ కసరత్తు చేస్తోందని మోదీ ప్రభుత్వంపై ఓవైసీ మండిపడ్డారు. ప్రతి ఎన్నికల ముందు ఇలానే జరుగుతుందని, తద్వారా వచ్చే ఎన్నికల్లో భాజపా లబ్ధి పొందాలని భావిస్తుందని విమర్శించారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ కసరత్తుగా తాను భావిస్తున్నానని ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలకు ముందు ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, చైనా వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని, బీజేపీ ఈ చర్యకు పాల్పడిందని అన్నారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీని అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆర్టికల్ 44ను ఉల్లంఘించడమేనని అన్నారు.

ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునేందుకు మహిళలకు ఎక్కువ హక్కులు ఉన్నాయని అన్నారు. అలాగే.. మహిళలకు మొదట ఆస్తిలో వాటా ఇవ్వబడుతుందనీ, ఇస్లాంలో స్త్రీకి భర్త, తండ్రి నుండి ఆస్తి వస్తుందనీ, అలాగే.. ఇస్లాంలో భార్య సంపాదనలో భర్తకు వాటా ఉండదనీ.. ఇలాంటి హక్కులు హిందూ స్త్రీలకు ఉండవని అన్నారు.

యూసీసీపై జరుగుతున్న చర్చ మెజారిటీ వర్గాల అభిప్రాయాలను రుద్దే ప్రయత్నమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ దుష్ప్రచారంలో భాగం కావద్దని లా కమిషన్‌ను కోరుతున్నామని చెప్పారు. జస్టిస్ గోపాల్ గౌడ ప్రకారం.. రాష్ట్రం (ఉత్తరాఖండ్) యుసిసిని ఏర్పాటు చేయలేమని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ న్యాయస్థానాల్లో చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు.