పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఫైర్ బ్రాండ్ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్ చేసిన ఒక తప్పుడు వీడియోపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నిప్పులు చెరిగారు. 

ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం అని ఒక నకిలీ వీడియోను ట్వీట్‌ చేసిన ఇమ్రాన్‌ ఖాన్‌ నెటిజన్లకు అడ్డంగా బుక్కయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నకిలీ వీడియోని ఒక దేశాధినేత పోస్టు చేయడంపై ఒవైసీ స్పందిస్తూ.. భారతదేశంలోని ముస్లింల గురించి బాధపడేకన్నా ముందు పాకిస్తాన్‌లో పరిస్థితిని చూసుకోవాలని ఇమ్రాన్‌కు హితవు పలికారు. పక్క దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. 

Also read: అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తా: బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనం

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఒక ఘటనను, భారత్‌లో జరిగినట్టుగా తప్పుడు పోస్ట్‌ చేశాడని ఇమ్రాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు ఓవైసి.  తొలుత తనదేశమైన పాకిస్తాన్ గురించి  ఆలోచించమని ఆయనకు వాస్తవ పరిస్థితులను గుర్తుచేశాడు అసదుద్దీన్. 

భారత ముస్లింలుగా తామందరం గర్వపడుతున్నామని, ఎప్పటికీ అలాగే ఉంటామని,  అసదుద్దీన్‌ బల్లగుద్ది మరీ చెప్పాడు. భారతీయ ముస్లింలు భారతీయులుగానే ఉంటారని, అది తమకెంతో గర్వకారణమని అసదుద్దీన్ అన్నాడు. 

ఇకపోతే... పౌరసత్వ సవరణ చట్టం పై కూడా మాట్లాడుతూ బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏ వంటి చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. 

ఎన్‌ఆర్‌సీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిని చంపేందుకు కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ లు కుట్రలు పన్నుతున్నాయని, దమ్ముంటే ముందు తనను చంపాలని సవాలు విసిరారు అసదుద్దీన్ ఓవైసి. 

Also read: ఎన్డీయే నుంచి బయటకు రండి... నితీశ్ కుమార్ కి ఓవైసీ సూచన

మైనారిటీల హక్కుల కోసం పోరాడే అసదుద్దీన్ పాకిస్థాన్ లోని సిక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు. తాజాగా కర్తార్‌పూర్‌లో పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై జరిగిన రాళ్ల దాడిపై అసదుద్దీన్‌ విచారం వ్యక్తం చేసాడు.

సిక్కులకు రక్షణ కల్పించాలని కోరడంతోపాటు, ఆ గురుద్వారాపై రాళ్ళ దాడికి పాల్పడిన వారిపై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.