కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద చట్టాలను బీజేపీయేతర పార్టీలన్నీ వ్యతిరేకించాలని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. బిహార్ లోని కిషన్ గంజ్ లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్డీయే నుంచి బయటకు రావాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ కి సూచించారు.  ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడాలని నితీశ్ కుమార్ ని ఓవైసీ కోరారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ (ఎన్డీయే) కూటమి నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా ఆలోచనా విధానం సరైనది కాదని, దేశాన్ని విభజించాలనే రీతిలో వారి పాలన ఉందని విమర్శించారు. దీనికి నిరసనగా ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటే తాము (ఎంఐఎం) నితీష్‌కు అండగా నిలుస్తామని ఒవైసీ వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీయూకు మద్దతు తెలుపుతామని ప్రకటించారు.

బిహార్‌తో పాటు దేశ వ్యాప్తంగా నితీష్‌ కుమార్‌కు మంచి గుర్తింపు ఉందని దానిని కాపాడుకోవాలని అసద్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ భవిష్యత్తు కోసం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన అన్నారు. అలాగే చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతోందని ఆయన గుర్తుచేశారు.