Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య ఎలా వెళతారు.. ఆ ప్రమాణం మరిచిపోయారా: మోడీపై అసదుద్దీన్ వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్రమోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఓ వర్గానికి చెందిన  ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు

MIM chief Asaduddin Owaisi slams PM Narendra Modi's plans to attend Ram Temple bhumi puja in ayodhya
Author
Ayodhya, First Published Jul 28, 2020, 6:28 PM IST

ప్రధాని నరేంద్రమోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఓ వర్గానికి చెందిన  ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

లౌకిక సూత్రాలకు కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ దేశ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన మోడీ.. ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నారని ఒవైసీ ఆరోపించారు.

అయోధ్య రామమందిర భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడీ వెళ్లడంపై అసదుద్దీన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్స్ గుంపు ధ్వంసం చేసిందని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు.

లౌకికతత్వమనేది రాజ్యాంగంలో ముఖ్యభాగమని దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని సూచించారు. మరోవైపు ఆగస్ట్ 5న అయోధ్యలో జరిగే రామ మందిర భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరుకానున్న సంగతి తెలిసిందే.

ఆయనతో పాటు మరో 250 మందికి ఇందుకు సంబంధించి ఆహ్వానం అందనుంది. కాగా ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రేను ఆహ్వానించకపోవడం కొంత చర్చనీయాంశమైంది. మందిర నిర్మాణం కోసం ఉద్ధవ్ థాక్రే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

కాగా రామాలయ పూజ సందర్భంగా హిందువులు దేశవ్యాప్తంగా నీరు, మట్టిని అయోధ్యకు తీసుకువస్తున్నారు. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా భూమి పూజ నిర్వహిస్తున్నామని.. ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఛైర్మన్ ఓ ప్రకటనలో తెలిపారు. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios