భోపాల్: తమకు సరైన భోజన వసతి కల్పించలేదని ఆరోపిస్తూ వలస కార్మికులు గురువారం నాడు మధ్యప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దులోని సెంద్వా పట్టణం వద్ద ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో వలస కూలీలు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జాతీయ రహదారి 3 పై సెంద్వా పట్టణం వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. వలస కూలీలు రోడ్డుపైనే నిలిచిపోయారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం తమకు కనీసం భోజనం కూడ కల్పించలేదని ఆరోపిస్తూ కూలీలు రోడ్డుపై పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు.

నెల రోజుల చంటి బిడ్డలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పంపింది. కానీ, తమకు ఎలాంటి వసతిని కల్పించలేదని కూలీలు ఆరోపిస్తున్నారు.24 గంటలుగా తాము ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరుకొన్నట్టుగా కూలీలు చెప్పారు. కనీసం తమకు మంచినీళ్లు కూడ ఇవ్వలేదని వలస కూలీ శైలేష్ తృప్తి చెప్పారు. పుణెలో పనిచేసిన శైలేష్ తృప్తి మధ్యప్రదేశ్ రాష్ట్ర వాసి. మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో వదిలివెళ్లారని వలస కూలీలు ఆరోపించారు. అంతేకాదు తమ భద్రత గురించి పట్టించుకోలేదు. మరో వైపు ఎవరూ కూడ తమను పట్టించుకోలేదని  ఆరోపించారు.

మహారాష్ట్ర నుండి వలస వచ్చిన కూలీల్లో కొందరిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలించాం. మిగిలిన వారిని తరలించేందుకు వాహనాలు అందుబాటులో లేవు. దీంతో వారు ఆందోళనకు దిగారు. రాళ్ల దాడి చేశారని జిల్లా కలెక్టర్ అమిత్ తోమర్ ప్రకటించారు. వలస కూలీలను శాంతింపజేశామన్నారు. 

మహారాష్ట్ర నుండి 135 బస్సుల్లో వలస కూలీలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పంపినట్టుగా అధికారులు ప్రకటించారు. 

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: నెల రోజుల చిన్నారితో 2 వేల కి.మీ. బైక్ పై బాలింత

వలస కూలీలకు ఆహారం, నీళ్లు, షెల్టర్ వసతిని కల్పించినట్టుగా అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు ఇదే మొదటి సారి కాదు. భర్వాని జిల్లాలో కూడ ఇదే తరహా ఘటన మే 3వ తేదీన చోటు చేసుకొన్న విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.

భర్వానీ జిల్లా సరిహద్దును మూసివేయడంతో ఈ ఘటన చోటు చేసుకొంది. ఆగ్రా-ముంబై జాతీయ రహాదారిపై వలస కూలీలు తమ గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిరసనకు దిగారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు రాళ్లు రువ్విన విషయాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు.