Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: లాక్‌డౌన్ భయంతో ఇంటి బాట పడుతున్న వలస కార్మికులు

రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని స్థానికులు భయపడుతున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చివరిసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పుడు వలస కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. స్వగ్రామాలకు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఇంకా తడిగానే ఉన్నాయి. చాలా మంది ఈ ప్రయాణంలో మరణించారు కూడా. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లోని వలస కార్మికులు లాక్‌డౌన్ విధిస్తారేమోననే భయంతో స్వగ్రామాలకు తరలి వెళ్లిపోతున్నారు.
 

migrant workers returning to home states fearing lockdown
Author
New Delhi, First Published Jan 9, 2022, 6:15 PM IST


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసు(Coronavirus Cases) పెరుగుతున్నాయి. గతంలో డెల్టా వేరియంట్‌తో కేసులు పెరిగినట్టే.. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌(Omicron Variant)తో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మళ్లీ క్రమంగా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ(Weekend Curfew) ప్రకటిస్తే.. మరికొన్ని నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్(Lockdown) తప్పదేమో అనే సందేహంలోకి ప్రజలు వెళ్తున్నారు. లాక్‌డౌన్ భయాలు అధికంగా వలస కార్మికుల్లో ఉన్నాయి. దేశంలో తొలిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు వారి బాధలు అంతా ఇంతా కాదు. వేరే రాష్ట్రాల్లోని తమ స్వగ్రామాలకు నడుచుకుంటూ వెళ్లిన హృదయ విదారక దృశ్యాలు అంత సులువుగా చెరిగిపోవు. అప్పటి తరహాలోనే కేసులు పెరుగుతుండటంతో వారిలో భయాలు పెరిగిపోతున్నాయి. అందుకే కొందరు వలస కార్మికులు(Migrant Workers) ఇప్పటికే ఇంటి బాట పట్టారు.

గత లాక్‌డౌన్ కాలంలో తిండి లేక, గూడు లేక.. ఆరోగ్య వసతులకూ దూరమై వలస కార్మికులు కష్టాల కడగండ్లను ఎదుర్కొన్నారు. క్రమంగా లాక్‌డౌన్‌ను పొడిస్తూ వెళ్లడంతో చేతిలో డబ్బులు లేక పస్తులతో కాలం గడిపిన రోజులు వారిని ఇంకా వెంటాడుతున్నాయి. అందుకే ఢిల్లీ నుంచి చాలా మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు బయల్దేరి వెళ్తున్నారు. ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమలు అవుతున్నది. కేసులు పెరుగుతుండటం, వీకెండ కర్ఫ్యూ విధించే దాకా పరిస్థితులు చేరడంతో తదుపరిగా విధించేది పూర్తిస్థాయి లాక్‌డౌన్ అయ్యే అవకాశం ఉన్నదని వారు ఇంటి దారి పట్టారు. ఒక వేళ వీకెండ్ కర్ఫ్యూను పొడగించకుంటే.. తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతామని, తమ పనుల్లో చేరుతామని వారు చెబుతున్నారు. అంతేకానీ, అక్కడే ఉండి లాక్‌డౌన్ తెచ్చే ముప్పులో పడబోమని అంటున్నారు.

ఢిల్లీలో పని చేసే వలస కార్మికుడు హేమంత్ మౌర్య ఇప్పటికే స్వగ్రామం వెళ్లిపోయాడు. పోయిన సారి లాక్‌డౌన్ విధించినప్పుడు తాను ఢిల్లీలోనే చిక్కుకుపోయినట్టు తెలిపాడు. అప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నానని అన్నాడు. అందుకే కర్ఫ్యూ మాట వినిపించగానే స్వరాష్ట్రానికి బయలుదేరానని చెప్పాడు. ఒక వేళ కర్ఫ్యూ పొడిగించకుంటే.. వెంటనే తిరిగి వస్తామని వివరించాడు. లాక్‌డౌన్ విధిస్తారేమోననే భయంతోనే ఈ నెల 6వ తేదీన సొంతూరికి బయల్దేరినట్టు చెప్పాడు. ఇక్కడ నిరుద్యోగ సమస్యలు ఉన్నా.. ముందు బ్రతికి ఉండాలి కదా అంటూ అన్నాడు. ఆయన మరో నలుగురితో కలిసి ఇంటికి వెళ్లినట్టు పేర్కొన్నాడు. మరో వలస కార్మికుడు రాజు మాట్లాడుతూ, కరోనా కేసులు పెరుగుతున్నాయని, పరిస్థితులు మళ్లీ కుదుటపడ్డ తర్వాత వెనక్కి వస్తామని చెప్పాడు. కర్ఫ్యూ ఎత్తేస్తే మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోతామని పేర్కొన్నాడు. తన గ్రామస్తుడు వినోద్‌తో కలిసి ఢిల్లీ వదిలిపెట్టినట్టు చెప్పాడు. ఢిల్లీలోని ప్రేమ్ నగర్‌లో నివసిస్తున్న కాంట్రాక్టర్ తౌఫిక్ అహ్మద్ ఈ పరిస్థితులపై మాట్లాడుతూ.. ఇంకా లాక్‌డౌన్ విధించకముందే తన కింద పని చేసే చాలా మంది వారి వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారని అన్నారు.

ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు 20 వేల మార్క్ దాటాయి. కేసులు పెరుగుతుండటంతో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికైతే మహమ్మారిని కట్టడి చేయడానికి నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలో లాక్‌డౌన్‌పై స్పందించారు. ప్రజలు మాస్క్‌లు ధరించి కొవిడ్ నిబంధనలు సక్రమంగా పాటిస్తే లాక్‌డౌన్ విధించబోమని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios