భారత వైమానిక దళానికి చెందిన మిగ్-27 యుద్ధ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. జైసల్మేర్ ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం నుండి పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడని తెలిపారు. ఈ విమాన ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.  

ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నట్లు రక్షణ శాఖ అధికారి సోంబిత్ ఘోష్ వెల్లడించారు. ఇటీవల ఈ తరహా యుద్ద విమానాలు ఎక్కువగా ప్రమాదానికి గురవుతుండటం రక్షణ శాఖలో ఆందోళనను సృష్టిస్తోంది. 

ర‌ష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ మిగ్‌ యుద్ద విమానాల పనితీరుపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. ఈ యుద్దవిమానాలు సాధారణ పరిస్థితుల్లోనే ఇలా వుంటే యుద్దాల సమయంలో ఇంకేం పనిచేస్తాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. అందువల్ల రక్షణ రంగానికి చెందిన విమానాల విషయంతోబ మరింత నాణ్యత పాటించాలని వారు సూచిస్తున్నారు.