Asianet News TeluguAsianet News Telugu

వలపు వల.. వీడియో కాల్ మాట్లాడి, గదికి తీసుకువెళ్లి.. రూ.16.5లక్షలకు కుచ్చుటోపీ.. చివరికి..

ఓ మధ్యవయస్కుడికి సోషల్ మీడియాలో వలపు వల విసిరిన ఓ మహిళ అతని నుంచి రూ.16.5లక్షలు దోచుకుంది. ఆ తరువాత విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. 

 

middle aged man honey trapping and extorting for Rs.16.5 lakhs in gujarat, 6 arrested
Author
First Published Jan 13, 2023, 8:55 AM IST

గుజరాత్ : గుజరాత్ లో మరో హనీ ట్రాప్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని  బ్లాక్  మెయిల్ చేసి రూ.16.5లక్షలు కాజేసిందో మహిళ. గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వ్యక్తికి సోషల్ మీడియాలో డిసెంబర్ 7వ తేదీన ఓ మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. అలా వారిద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. ఈ క్రమంలో వారిద్దరూ స్నేహితులయ్యారు. నెమ్మదిగా వలపు మొదలయ్యింది. అతడు పూర్తిగా తన ట్రాప్లో చిక్కుకున్నాడని నిర్ధారించుకున్న తర్వాత ఆమె వీడియో కాల్ వల విసిరింది. అలా ఇద్దరు  వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. తాను కూడా సూరత్ లోనే ఉంటున్నానని.. ఒకసారి కలుసుకుందామని చెప్పింది. దీంతో  టెంప్ట్ అయిన అతను ఆ మహిళను కలిసేందుకు వెళ్లాడు. 

ఒకచోట వారిద్దరూ కలుసుకున్నారు. అక్కడి నుంచి అతడిని హరిదాం సొసైటీ సమీపంలోని ఓ ఇంటికి  ఆ మహిళ తీసుకువెళ్లింది.  ఇంట్లోకి వెళ్లాక గదిలోకి తీసుకువెళ్లి అనుచితంగా ప్రవర్తించింది. అతని దానిని వ్యతిరేకిస్తున్న క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. ఇద్దరూ ఒకరు ఆమె భర్త, మరొకరు ఆమె సోదరుడిని అని చెప్పుకున్నారు. అతని మీద దాడి చేశారు. మహిళపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని బెదిరించారు. అతడి ఫోన్  లాగేసుకున్నారు. అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తామని  బెదిరించారు. రేప్ కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో మరో వ్యక్తి వచ్చాడు.  అతను మధ్యవర్తిలా నటించాడు. రూ.8.50లక్షలు ఇస్తే ఈ సమస్య ఇక్కడితో ముగిసిపోయేలా మధ్యవర్తిత్వం చేస్తానని  చెప్పాడు.  సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చాడు.

నగ్న వీడియోకాల్ తో బ్లాక్ మెయిల్.. వ్యాపారికి రూ.2.69 కోట్లు టోకరా..

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానని బాధ పడిన బాధితుడు.. ఏం చేయలేక ఇంటి పేపర్లు, తన భార్య  నగలు తాకట్టు పెట్టి, అప్పులు చేసి నిందితులకు 7.5 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత డిసెంబర్ 19న మరో ఇద్దరు వ్యక్తులు బాధితుడికి ఫోన్ చేశారు.  తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని, అత్యాచారయత్నం చేశాడని అతడిపై కేసు నమోదయిందని తెలిపారు. దీని మీద విచారణ జరగకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిపోయిన బాధితుడు మరో తొమ్మిది లక్షలు వారికి సమర్పించాడు. 

అక్కడితో బాధితుడికి తాను హనీట్రాప్ లో చిక్కుకున్నానని అర్థమయ్యింది. ఇకముందు కూడా ఈ సమస్య తనని వెంటాడుతుందేమో అని భయం పట్టుకుంది. అందుకే విషయం మొత్తాన్ని కుటుంబ సభ్యులకు తెలియచెప్పాడు.  వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించాడు. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతడిని హనీ ట్రాప్ లోకి దింపిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios