ముగ్గురు యువతులు ఫ్రెండ్‌షిప్ పేరుతో ఓ వ్యాపారిని ట్రాప్ చేసి నిలువునా దోపిడి చేశారు. వీరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా.. మరో యువతి వీరికి దూరపు చుట్టం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరు బాగా డబ్బున్న వారిని ఎంచుకుని స్నేహం, ప్రేమ పేరుతో ట్రాప్ చేసి డబ్బు, నగలు దోచుకునేవారు.

ఈ క్రమంలో ఓ వ్యాపారిని టార్గెట్ చేసిన వీరు... అతనికి మాయమాటలు చెప్పి హోటల్ రూంకి తీసుకెళ్లి బాగా తాగించారు. అతను మద్యం మత్తులో ఉండగా అతని నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు వాచీలు, కారు డాక్యుమెంట్లు తీసుకున్నారు.

క్రెడిట్, డెబిట్, పేటీఎంల పాస్‌వర్డ్‌ను వ్యాపారి నుంచే తెలుసుకుని.. రూ.46 వేలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. అనంతరం క్యాబ్ బుక్ చేసుకుని దర్జాగా వెళ్లిపోయారు. మత్తులోంచి తేరుకున్న వ్యాపారి తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన ఖాకీలు ముగ్గురిని పట్టుకున్నారు.

వీరు ఇదే రకంగా చాలా మందిని నిలువు దోపిడి చేశారని.. నకిలీ గుర్తింపు కార్డులు చూపించి పబ్బుల్లో ఎలాంటి రుసుం లేకుండా వెళ్లేవారని తేలింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ కిలాడీ లేడీలపై కేసులు నమోదైనట్లు తేలడంతో పోలీసులు వాటిని ఆరా తీసే పనిలో పడ్డారు.