జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఉన్న ఓ మసీదులోకి సైన్యం చొరబడిందని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఆ సమయంలో అందులో ఉన్న ముస్లింలను ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేయాలని బలవంతం చేశారని అన్నారు.
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో మసీదులోకి ఇండియన్ ఆర్మీకి చెందిన 50 ఆర్ఆర్ దళాలు చొరబడి ముస్లింలను ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయాలని బలవంతం చేశాయని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. ఇది రెచ్చగొట్టే చర్య అని, దర్యాప్తు ప్రారంభించాలని చినార్ కార్ప్స్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ను ముఫ్తీ కోరారు.
‘‘పుల్వామాలోని మసీదులోకి 50 ఆర్ఆర్ కు చెందిన సైనికులు చొరబడి, లోపల ఉన్న ముస్లింలను 'జై శ్రీరామ్' అని నినదించాలని బలవంతం చేశారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక్కడ ఉన్నప్పుడు, అది కూడా యాత్రకు ముందు ఇలాంటిది జరగడం కేవలం రెచ్చగొట్టే చర్య మాత్రమే. దీనిపై రాజీవ్ ఘాయ్ వెంటనే విచారణ జరిపించాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఏప్రిల్ లో జమ్ముకాశ్మీర్ లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా స్థానికులను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని ముఫ్తీ ఆరోపించారు. జమ్ముకాశ్మీర్ లో పరిస్థితి గ్వాంటనామో బే కంటే దారుణంగా ఉందని పేర్కొన్న పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ.. కేంద్రపాలిత ప్రాంతంలో జీ20 ఈవెంట్ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమైనప్పటి నుంచి వందలాది మంది స్థానిక పురుషులను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.
అంతకుముందు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో జరిగిన భారీ సమావేశం తర్వాత ముఫ్తీ విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోకముందు తాను పాలించిన జమ్మూకశ్మీర్ బీజేపీకి ప్రయోగశాల అని అన్నారు. ‘‘నిజానికి భారత్ ఆలోచనపై దాడి జరుగుతోంది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో సహా ఆ పార్టీ నాయకులను జైల్లో పెట్టినప్పుడు ఇది చాలా స్పష్టంగా కనిపించింది’’ అని అన్నారు.
‘జమ్మూకాశ్మీర్ ఒక ప్రయోగశాల. కేంద్ర ఆర్డినెన్స్ ద్వారా నేడు ఢిల్లీలో మనం చూస్తున్నది మా రాష్ట్రంలో చాలా ముందుగానే ప్రారంభమైంది. దురదృష్టవశాత్తూ అప్పట్లో చాలా తక్కువ మందికి మాత్రమే అది అర్థమైంది. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంది, దేశం మొత్తాన్ని కశ్మీరీకరణ చేస్తుంది’’ ముఫ్తీ అన్నారు.
