గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (Greater Chennai Corporation) మేయర్‌గా ప్రియా రాజన్‌ (Priya Rajan) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత జీసీసీ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ ప్రమాణ స్వీకారం చేయించారు.

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (Greater Chennai Corporation) మేయర్‌గా ప్రియా రాజన్‌ (Priya Rajan) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత జీసీసీ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ ప్రమాణ స్వీకారం చేయించారు. అతిచిన్న వయసులో చెన్నై మేయర్‌ పదవిని చేపట్టిన మహిళగా ప్రియ రికార్డు సృష్టించారు. అలాగే దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ చెన్నై మేయర్‌ పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా తారా చెరియన్, కామాక్షి జయరామన్ తర్వాత చెన్నై మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మూడో మహిళగా ప్రియ నిలిచారు. 

ఇటీవల జరిగిన చెన్నై కార్పొరేషన్ ఎన్నికల్లో డీఎంకే అదిరిపోయే విజయం సొంతం చేసుకుంది. మొత్తం 200 వార్డులకు గానూ 153 చోట్ల డీఎంకే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 74 వార్డు నుంచి విజయం సాధించిన ప్రియాను చైన్నై కార్పొరేషన్‌‌ మేయర్ పదవికి డీఎంకే ప్రతిపాదించింది. డీఎంకే భారీ విజయం నేపథ్యంలో ప్రియ విజయం సులువుగా జరిగిపోయింది. మేయర్‌ పదవికి ప్రియా ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. 

ప్రియా రాజన్ విషయానికి వస్తే.. ఆమె కుటుంబం తొలి నుంచి రాజకీయాల్లో ఉంది. ఆమె పెరంబూర్‌ మాజీ ఎమ్మెల్యే చెంగై శివమ్‌ మనవరాలు. ప్రియా తండ్రి ఆ ప్రాంతంలో డీఎంకే జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వారి కుటుంబం చాలా ఏళ్లుగా డీఎంకేలో కొనసాగుతుంది. ప్రియ కూడా 18 ఏళ్లకే డీఎంకే‌లో చేరి.. పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటూ వస్తున్నారు. ప్రియ చెన్నైలోనే పుట్టి పెరిగారు. ఆమె శ్రీకన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి M.com పట్టా పొందారు. 

ఇక,  చెన్నై మేయర్‌ పదవిని తమిళ రాజకీయాల్లో చాలా కీలకమైనదిగా పరిగణిస్తుంటారు. గతంలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్‌లు కూడా ఆ పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.