అద్దెకుంటున్న ఇంట్లోనే చోరీ...

అతడు బాగా చదివి ఎంబీఎ పట్టా పొందాడు. భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెంచుకుని ఉద్యోగం చేసి సమాజంలో సగర్వంగా బ్రతకాలనుకున్నాడు. కాని కాళ్లరిగేలా తిరిగినా ఒక్క ఉద్యోగం రాలేదు. ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం దొరకడం కష్టమని బావించిన అతడు మరో దారి ఎంచుకున్నాడు. దొంగగా మారి డబ్బులు సంపాదించాలనుకుని చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన తమిళ నాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

తూత్తుకుడి జిల్లా ఉడన్‌కుడికి చెందిన ఇళమది అనే యువకుడు ఎంబీఏ చేసి ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చాడు. అక్కడ తిరువికనగర్‌ ప్రభు వీధిలో అరివళగన్‌ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు రూం తీసుకున్నాడు. ఇలా రూంలో ఉంటూ ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టాడు. అయితే ఎన్ని ఇంటర్వూలకు వెళ్లినా ఉద్యోగం రాకపోవడంతో విరక్తి చెందాడు. అంతే కాకుండా ఖర్చులకు, రూం రెంటుకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలనే పాడు బుద్ది కల్గింది.

ఈ క్రమంలోనే ఇంటి ఓనర్ తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాడు. దీన్నే అదునుగా భావించిన ఇళమది ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారాన్ని దొంగిలించాడు. తర్వాత తనకు ఏమీ తెలియనట్లే ఉండిపోయాడు.

అయితే తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన అరివిళగన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దొంగతనం జరిగిన విధానాన్ని చూసి ఈ చోరీ ఈ ఇంట్లో ఉండేవారే చేసివుంటారని అనుమానించారు.ఇందుకోసం ఇంట్లో అద్దెకుండే వారందరిని విచారించారు. ఈ విచారణలో భయపడిపోయిన ఇళమది నగలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడు.

దీంతో ఇళమది నుండి నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అరివళగన్‌ కు అప్పగించారు. అనంతరం నిందితుడిపై కేసుమ నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.