Asianet News TeluguAsianet News Telugu

రూ.లక్ష కోసం.. భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పేశాడు

 చట్ట ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ క్రిమినల్ చర్యగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయితే నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

Mathura Registers Case Under New Triple Talaq Law
Author
Hyderabad, First Published Aug 2, 2019, 12:36 PM IST

కేవలం లక్ష రూపాయల కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా...  ఆ వ్యక్తిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిపుల్ తలాక్ ని కేంద్ర ప్రభుత్వం చట్టంగా మార్చిన తర్వాత రోజే ఇలా జరగడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... యూపీలోని కోసి ప్రాంతానికి చెందిన జుమిరాత్, మేవత్ కు చెందిన ఇక్రమ్ లకు కొద్ది నెలల క్రితం వివాహమైంది. అయితే... వరకట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో గురువారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వరకట్నం కింద లక్ష రూపాయలు చెల్లిస్తేనే జుమిరాత్ ను భార్యగా అంగీకరిస్తానని ఇక్రమ్ తేల్చి చెప్పాడు.

తమ వద్ద ఇప్పుడు అంత డబ్బు లేదని జుమిరాత్ కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. దీంతో... కోపంతో ఊగిపోయిన ఇక్రమ్.. నడిరోడ్డుపైనే భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఇక నుంచి తనకు భార్య జుమిరాత్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో... బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.

ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ఇక్రమ్ పై కేసు నమోదు చేశామని మథుర ఎస్పీ షాలాబ్ మాథుర్ తెలిపారు. ఈ చట్ట ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ క్రిమినల్ చర్యగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయితే నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios