మిజోరంలోని ఐజ్వాల్ జిల్లా తుయిరియల్‌ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడిన అనంతరం చోటుచేసుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరిందని పోలీసుల వెల్లడించారు. అలాగే అక్కడ ప్రమాదం చోటుచేసుకోవడానికి కారణమైన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

మిజోరంలోని ఐజ్వాల్ జిల్లా తుయిరియల్‌ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడిన అనంతరం చోటుచేసుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరిందని పోలీసుల వెల్లడించారు. అలాగే అక్కడ ప్రమాదం చోటుచేసుకోవడానికి కారణమైన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు వివరాలను వెల్లడించారు. ‘‘అక్టోబర్ 29 సాయంత్రం 4:35 గంటలకు 22,000 లీటర్ల పెట్రోలుతో వెళుతున్న ట్యాంకర్ పెట్రోల్‌ను చంపై వద్ద డెలివరీ చేయవలసి ఉంది. అయితే తుయిరియల్‌ ఎయిర్‌ఫీల్డ్ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురైంది. 

దీంతో పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్‌ను సేకరించి నిల్వ చేసుకోవడానికి పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారంతా అక్కడున్న సమయంలోనే సాయంత్రం 5.50 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెట్రోల్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించారు.

ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) బృందం సహాయంతో ప్రమాదం చోటుచేసుకన్న ప్రదేశాన్ని సూక్ష్మంగా తనిఖీ చేశారు. ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణమని గుర్తించడం జరిగింది. అలాగే ప్రజలు పెట్రోల్‌ను సేకరించడం ప్రారంభించిన సమయంలో ఎవరో లైటర్ వెలిగించారని లేదా పొగతాగుతున్నారని.. దీనితోనే మంటలు చెలరేగాయి. పెట్రోల్ అక్కడే ఉండటంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది’’ అని పోలీసులు తెలిపారు. 

ఇక, ఈ ఘటనపై బాంగ్‌కౌన్ పోలీసులు వెంటనే దర్యాప్తును కొనసాగించారు. విశ్వసనీయ మూలం నుండి వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నవంబర్ 1 అర్ధరాత్రి తుయిరియల్‌కు చెందిన టీబీసీ లల్లావ్మా (28)గా గుర్తించబడిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. “నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతను పెట్రోల్‌తో వెళ్తున్న ట్యాకర్ ప్రమాదానికి గురైందని తెలుసుకుని.. పెట్రోల్‌ను సేకరించడానికి వెళ్లినట్లు పేర్కొన్నాడు. అయినప్పటికీ పెట్రోల్‌ను సేకరించే పనిలో భారీ సంఖ్యలో ప్రజలు నిమగ్నమై ఉండటం, గందరగోళం కారణంగా అతను తగినంత పెట్రోల్‌ను పొందలేకపోయాడు. కోపంతో అతను బయటకు వచ్చి, లైటర్‌ను వెలిగించాడు. అతను సేకరించిన కొంత పరిమాణంలో పెట్రోల్ ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌కు నిప్పటించాడు. పెట్రోల్‌కు నిప్పంటుకోవడంతో అతను కాలుతున్న బాటిల్‌ను నేలపై విసిరాడు. అది చివరికి పెద్ద అగ్నిప్రమాదానికి దారితీసింది’’ అని పోలీసులు తెలిపారు. 

నిందితుడు తన ఇంటికి చేరుకుని ప్రాణనష్టం గురించి తెలుసుకున్న తర్వాత.. తన ఇంటికి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే అతని స్నేహితుడు, భార్య అతన్ని చూడటంతో ఆ పని చేయకుండా అతడిని అడ్డుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన అనంతరం నవంబర్ 3న జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.