పట్టపగలే బహిరంగంగా ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి రూ. 10 లక్షల చోరీ.. రెండు గన్‌లతో బెదిరించి భారీ దొంగతనం (వీడియో)
ఢిల్లీలో ఓ దొంగ పట్టపగలే బహిరంగంగా ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి బయటకు తీసిన రూ. 10 లక్షలను పట్టుకుని ఉడాయించాడు. రెండు చేతులా గన్‌లను పట్టుకుని సిబ్బందిని బెదిరిస్తూ ఆ డబ్బు పట్టుకుని సింపుల్‌గా నడుచుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

న్యూఢిల్లీ: ఓ దొంగ ముఖానికి మాస్క్ ధరించి చేతుల్లో రెండు గన్‌లు పట్టుకుని చోరీకి బయల్దేరాడు. ఏటీఎంలో డబ్బులు నింపడానికి ఆగి ఉన్న క్యాష్ వ్యాన్ వద్దకు వెళ్లాడు. సిబ్బంది అప్పుడు డబ్బు మూటను ఏటీఎం కియోస్క్‌లోకి తీసుకెళ్లారు. అప్పుడే ఆ దొంగ సెక్యూరిటీ గార్డ్‌ను షూట్ చేశాడు. వెంటనే మిగతా సిబ్బంది అంతా భయంతో పరుగు అందుకున్నారు. ఇద్దరు సిబ్బందిని బెదిరించి కియోస్క్ నుంచి డబ్బు బయటకు తెప్పించాడు. ఆ డబ్బును చేతిలో పట్టుకుని చేతుల్లో గన్‌తో అలాగే వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ ఫ్లై ఓవర్ దగ్గరలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం దగ్గర చోటుచేసుకుంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ దొంగ షూట్ చేసిన ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ ఉదయ్‌పాల్ సింగ్ (55) తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ చేర్చేలోపే మరణించాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4.44 గంటల ప్రాంతంలో జరిగినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తున్నది.
Also Read: హైద్రాబాద్ వనస్థలిపురం దోపీడీ కేసులో మరో ట్విస్ట్: రూ. 25 లక్షలు చోరీ అయినట్టుగా గుర్తింపు
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, క్యాష్ వ్యాన్ నుంచి నగదును ఏటీఎం క్యాష్‌లో డిపాజిట్ చేయడానికి సిబ్బంది రెడీ అయ్యారు. క్యాష్‌ను వ్యాన్ నుంచి దింపి ఏటీఎం కియోస్క్‌లోకి తీసుకెళ్లారు. అదే సమయంలో అంటే సాయంత్రం 4.44 గంటలకు ఓ వ్యక్తి మాస్క్ ధరించి అటు వైపుగా మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు. ఏటీఎం ముందు పార్క్ చేసి ఉంచిన క్యాష్ వ్యాన్ వద్దకు వెళ్లాడు. నిమిషాల్లోనే డ్రైవర్ ఒక్క ఉదుటున డోర్ ఓపెన్ చేసి బయటకు దూకాడు. పరుగు తీశాడు. ఆ మాస్క్ ధరించిన వ్యక్తి ఏటీఎం సెక్యూరిటీ గార్డును షూట్ చేశాడు.
ఆ వెంటనే ఏటీఎం కియోస్క్‌లో ఉన్న ఇద్దరు అధికారుల వైపు ఆ మాస్క్ ధరించిన వ్యక్తి రెండు చేతుల్లోని గన్‌లతో టార్గెట్ చేశాడు. వారు వెంటనే భయంతో బయటకు వచ్చారు. కానీ, వారిని లోపలికి వెళ్లి డబ్బు బయటకు తేవాల్సిందిగా ఆదేశించాడు. ఇద్దరిలో ఒకరు వెంటనే ఏటీఎంలోకి వెళ్లి ఆ డబ్బును బయటకు తెచ్చి అక్కడి నుంచి పారిపోయారు.
ఆ తర్వాత డబ్బు మూటను దొంగ తన వద్దకు తీసుకున్నాడు. చేతిలో గన్ అలాగే పట్టుకుని ఆ దొంగ డబ్బుతో ఉడాయించాడు.
ఆ దొంగ రూ. 10.78 లక్షల నగదును చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. దొంగ కోసం గాలింపులు ప్రారంభించినట్టు వివరించారు.