తమిళనాడులో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై రెండేళ్లు దాటినా ఇంకా పిల్లలు కాలేదని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు సూటిపోటు మాటలతో వేధించారు. ఈ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

చెన్నై: పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాది తిరిగేలోపు పిల్లలు కావాలని పెద్దలు తీవ్ర ఒత్తిడి పెడుతుంటారు. నవ దంపతులు ఏకాంతాన్ని పంచుకోవడం, పరస్పర ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు అర్థం చేసుకునే సమయం కూడా పెద్దగా ఇవ్వరు. ఇది దాదాపు అన్ని చోట్లా జరుగుతున్నది. పిల్లల కోసం పెద్దలు చూపే ఆతృత నవదంపతులపై మానసికంగా పెద్ద పెట్టు పెడుతున్నది. కొన్నిసార్లు నవ దంపతులకు పిల్లలు పుట్టడం ఆలస్యం జరగవచ్చు. ఆరోగ్య రీత్యా కూడా ఇద్దరిలో ఎవరికైనా సమస్య ఉండొచ్చు. వాటిని శాస్త్రీయంగా పరిష్కరించుకుంటే ఫలితం ఉంటుంది. కానీ, తరతరాలుగా పాతుకుపోయిన నమ్మకాలతో సంతానం కాకపోవడానికి మహిళలో లోపమే అన్నట్టుగా వేలెల్తి చూపుతుంటారు. ఈ జాఢ్యమే తమిళనాడులో ఓ వివాహిత ఆత్మహత్యకు కారణమైంది.

తమిళనాడులో నెట్టుకాడు గ్రామానికి చెందిన 21 ఏళ్ల సౌందర్య, చెన్నవరం గ్రామానికి చెందిన గణేషన్‌ పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకుని రెండేళ్లు దాటింది. కానీ, ఇంకా సంతానం కలుగలేదు. అందరి అమ్మాయిల్లాగే సౌందర్య కూడా ఒక రకమైన బెరుకు, భయాలతో పెళ్లికి సిద్ధమైంది. మరో వైపు భర్త బాగా చూసుకుంటాడనీ గంపెడు ఆశలతో మెట్టినింట అడుగు పెట్టింది. తొలినాళ్లలో అంతా సంతోషంగానే సాగింది.

Also Read: "అన్ని కులాల వారూ అర్హులే.." : అర్చకుల నియామకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

కానీ, నెలలు గడుస్తున్నా కొద్దీ ఆమెపై ఒత్తిడి పెరిగింది. పిల్లలు కావడం లేదనే మాటలు ఇప్పుడు వేధింపులుగా మారిపోయాయి. సూటిపోటి మాటలతో అత్తామామలు, బంధువులు వేధించారు. ఈ వేధింపులతో ఆమె ఒంటరైపోయింది. మానసికంగా తీవ్ర అలజడికి లోనైంది. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. 

ఈ నెల 13వ తేదీన తల్లిందండ్రులకు ఫోన్ చేసి సంతానలేమీ కారణంగా తాను ఎదుర్కొంటున్న వేధింపులను చెప్పింది. తల్లిదండ్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. సరైన పరిష్కారం ఆమెకు కనిపించలేదు. దీంతో ఫోన్ కట్ చేసి ఏం చేయాలా? అని ఆత్మహత్య ఆలోచనల వైపు సాగింది. పురుగుల మంది ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ కట్ చేయడంతో తల్లిదండ్రులకు బిడ్డ ప్రాణంపై అనుమానాలు వచ్చాయి. వెంటనే బిడ్డ వద్దకు వెళ్లారు. కానీ, అప్పటికే ఆమె పురుగుల మందు తాగేసింది. వెంటనే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, చికిత్స పొందుతూ మరణించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.