కర్ణాటకలో ఓ విచిత్ర పెళ్లి జరిగింది. ఇద్దరు మగ పిల్లలకు పెద్దలంతా కలిసి పెళ్లి చేశారు. ఇద్దరిపై అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. భోజనాలు ఏర్పాటు చేసి, సంబరాలు జరుపుకున్నారు. ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.  

ఆ గ్రామం నడిబొడ్డున పెళ్లి వేదిక సిద్ధమైంది. గ్రామ పెద్దలంతా వచ్చారు. పెళ్లి కొడుకు తలకు తలపాగా కట్టారు. బాసింగం చుట్టారు. పెళ్లి ముహుర్తానికి టైమ్ అయ్యిందని పురోహితుడు పిలిచాడు. వెంటనే అటు నుంచి చీర కట్టుకొని, జడ వేసుకొని పెళ్లి కూతురు వేషంలో ఉన్న మరో అబ్బాయి వచ్చాడు. మీరు చదవింది కరెక్టే. వచ్చింది అమ్మాయి కాదు.. అబ్బాయే. ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఇద్దరు అబ్బాయిల పెళ్లి కాబట్టి. ఈ విచిత్ర పెళ్లి కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా మొగలకొప్పె గ్రామంలో బుధవారం అర్ధరాత్రి సంప్రదాయబద్ధంగా జరిగింది. 

ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇలా ఇద్దరు అబ్బాయిల పెళ్లి చేయడానికి ఓ బలమైన కారణం ఉందని స్థానికులు చెబుతున్నారు. చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఈసారి సరిపడా వర్షాలు పడలేదు. ఇప్పుడు వర్షాలు వస్తేనే పంటలు చేతికి వచ్చే పరిస్థితి నెలకొంది. లేకపోతే ఆ జిల్లాలో రైతులు వేసిన పంటలు పూర్తిగా ఎండిపోతాయి. ఇప్పటికే జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మినుము, మొక్కజొన్న, వేరుశనగ, పెసలు, అలసందే, ఆవాలు, చూచెల్లు, తొగరి తదితర వర్షాధార పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆకాశం వైపు మొహం పెట్టి వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

అందుకే వర్షం పడాలని అక్కడి ప్రజలు ఇలా పాత సంప్రదాయాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఇద్దరు బాలురకు పెళ్లి చేస్తే ఇలా పెళ్లి చేసుకుంటే వర్షాలు కురుస్తాయని అక్కడి ప్రజల విశ్వాసం. బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ వివాహం.. అసలైన పెళ్లినే తలపించింది. ఆ గ్రామస్తులందరూ డబ్బులతో సంబరాలు చేస్తూ, వివిధ పూజలు నిర్వహించి, వరుడి వేషంలో ఉన్న అబ్బాయికి, వధువు వేషంలో ఉన్న మరో అబ్బాయికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.