భార్య ఎప్పుడు ఒకే అంటే.. అప్పుడే శృంగారం.. బలవంతం చేశారో..

Marriage Doesn't Mean Wife Always Ready For Sex: Court On Marital Rape
Highlights

మారిటల్ రేప్ పై దిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 

భార్యకు ఇష్టం లేకుండా భర్త ఆమెతో శృంగారం చేయాలనుకోవడం నేరం కిందకే వస్తుందని అంటోంది దిల్లీ హైకోర్టు. భర్త కావాలనుకున్న ప్రతిసారీ భార్య శృంగారం బలవంతంగా చేయాల్సిన అవసరం లేదని  దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. శారీరక సంబంధాన్ని నిరాకరించే హక్కు భార్యాభర్తలిద్దరికీ ఉంటుందని స్పష్టం చేసింది. 

జీవిత భాగస్వామిపై అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘పెళ్లంటే భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు భార్య ఎల్లవేళలా సంసిద్ధంగా, సమ్మతంతో ఉండటం కాదు. ఆమె అంగీకారంతో ఉన్నట్లు భర్త నిర్ధారించుకోవాలి’’ అని ధర్మాసనం తెలిపింది. 

జీవిత భాగస్వామిపై అత్యాచారం కేసుల్లో బలప్రయోగం వంటి అంశాలనే పరిగణనలోకి తీసుకోవాలంటూ ‘మెన్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’ స్వచ్ఛంద సంస్థ చేసిన వాదనతో న్యాయస్థానం విభేదించింది. ‘‘అత్యాచారానికి శారీరక బలం అవసరమని చెప్పడం సరికాదు. అత్యాచారం కేసుల్లో గాయాల కోసం చూడాల్సిన పనిలేదు. ప్రస్తుతం అత్యాచారం నిర్వచనం పూర్తిగా మారిపోయింది’’ అని పేర్కొంది. 

‘‘బల ప్రయోగం ద్వారా అత్యాచారం చేయాల్సిన పనిలేదు. తనతో శృంగారంలో పాల్గొనకపోతే ఇంటిఖర్చులకు, పిల్లలకు డబ్బు ఇవ్వబోనని భార్యను భర్త ఆర్థికపరమైన ఒత్తిడికి గురిచేస్తే.. ఆ బెదిరింపులకు భయపడి ఆమె శృంగారంలో పాల్గొనాల్సి వస్తుంది. అలాంటప్పుడు భర్తపై ఆమె అత్యాచారం కేసు దాఖలు చేస్తే ఏమవుతుంది?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.
 

loader