Asianet News TeluguAsianet News Telugu

16 రోజుల తర్వాత.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు కాస్త ఉపశమనం

Marginal Cut In Petrol, Diesel Prices After 16 Days Of Hikes

వాహనదారులకు చమురు సంస్థలు కాస్త ఉపశమనం కలిగించాయి. 16 రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు  తగ్గాయి. దేశంలో అతిపెద్ద ఫ్యూయల్‌ రిటైలర్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఇంధన ధరలను తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గాయి. 

ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర బుధవారం 60 పైసలు తగ్గి, రూ.77.83గా నమోదైంది. డీజిల్‌ ధర కూడా 56 పైసలు తగ్గి రూ.68.75గా రికార్డైంది. మిగతా నగరాల్లో కూడా లీటరు పెట్రోల్‌ ధర.. కోల్‌కత్తాలో రూ.80.47కు, ముంబైలో రూ.85.65కు, చెన్నైలో రూ.80.80కు, హైదరాబాద్‌లో రూ.82.45కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్‌ ధర కోల్‌కతాలో రూ.71.30గా, ముంబైలో రూ.73.20గా, చెన్నైలో రూ.72.58గా, హైదరాబాద్‌లో రూ.74.73గా రికార్డయ్యాయి. స్థానిక పన్నుల నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ ఈ ధరలు వేరువేరుగా ఉన్నాయి.  

గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పైపైకి ఎగుస్తూనే సరికొత్త స్థాయిలను తాకుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ ధరలు రికార్డు గరిష్టాలకు కూడా చేరకున్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్ధుగా ఉన్న ఈ ధరలు, గత 16 రోజుల నుంచి మళ్లీ చుక్కలు చూపించడం ప్రారంభించాయి. 

ఇంధన ధరలు పెరగడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ ధరల పెంపుకు అడ్డుకట్ట వేసేందుకు తాము దీర్ఘకాలిక పరిష్కారాన్ని వెతుకుతామని ఓ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా కూడా ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. 

తాజాగా అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ధరలు తగ్గించినట్టు తెలిసింది. ఇంధన సరఫరాపై విధించిన ఆంక్షలను తొలగించి, సరఫరాను పెంచుతామని రష్యా చెప్పడంతో, అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios