జీరగూడెం దాడిపై మావోయిస్టులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో రెండు పేజీల లేఖను విడుదల చేశారు ఆ పార్టీ అధికారిక ప్రతినిధి విఠల్.

తమ వద్ద బందీలుగా వున్న వాళ్లను వదిలిపెట్టేందుకు సిద్ధమని మావోయిస్టులు తెలిపారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీని అప్పగిస్తామని వెల్లడించింది. అప్పటి వరకు తమ జనాతన సర్కార్‌లో బందీ క్షేమంగా వుంటాడని మావోయిస్టులు తెలిపారు.

2 వేల మంది పోలీసులు తమపై దాడికి వచ్చారని.. పీఎల్‌జీఏను నిర్మూలించేందుకు ప్లాన్ చేశారని మావోయిస్టు కమిటీ ఆరోపించింది. విజయ్ కుమార్ నేతృత్వంలో 5 రాష్ట్రాల అధికారులు దాడికి పన్నాగం పన్నారని.. జీరగూడెం దాడిలో నలుగురు మావోయిస్టులు మృతి చెందాని తెలిపారు.

పోలీసులు మాకు శత్రువులు కాదని.. పాలకవర్గం తెచ్చిన యుద్ధంలో పోలీసులు బలి పశువులు కావొద్దని మావోయిస్ట్ కమిటీ చెప్పింది. ప్రజలను, వనరులను, ప్రజాసంపదను కాపాడేందుకే ప్రతి దాడి చేయాల్సి వస్తోందని పేర్కొంది.

Also Read:మా పోరాటం ప్రభుత్వంపైనే జవాన్లపై కాదు: మావోయిస్టు పార్టీ

దాడిలో 14 ఆయుధాలు, 2 వేల తూటాలు, కొంత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని మావోయిస్ట్‌లు చెప్పారు. ఘటనలో చనిపోయిన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ లేఖలో పేర్కొన్నారు. 

కాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్- సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు జవాన్లు గల్లంతవ్వగా, ఒకరిని మావోలు బంధీగా పట్టుకున్నారు.