Asianet News TeluguAsianet News Telugu

Maoist Attack: ఉదయమే ఎన్‌కౌంటర్.. మధ్యాహ్నం ఆర్మీ వ్యాన్ పేల్చివేత.. 20 కి.మీల దూరంలోనే ఘటన

ఛత్తీస్‌గడ్‌లో బుధవారం మధ్యాహ్నం జవాన్లపై మావోయిస్టులు అటాక్ చేశారు. వెహికిల్ డ్రైవర్, 10 మంది డీఆర్జీ జవాన్లను చంపేశారు. ఉదయమే ఎన్‌కౌంటర్ జరిగింది. అక్కడి నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. ఆ ఎన్‌కౌంటర్ సైట్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం ఈ దాడి జరిగింది.
 

Maoist attack on DRG Officials in chhattisgarhs dantewada, how and what happened kms
Author
First Published Apr 27, 2023, 4:23 AM IST

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టు శకం ముగిసిందని, దాడులు తగ్గిపోయాయని ఒక వైపు ప్రభుత్వాలు భావిస్తున్న సమయంలోనే వారు విరుచుకుపడ్డారు. దంతేవాడ జిల్లాలో పది మంది జవాన్లు, వెహికిల్ డ్రైవర్‌ను బుధవారం పేల్చి చంపేశారు. అర్ణపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఐఈడీని పేల్చి భద్రతా అధికారులను హతమార్చారు. రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.

2021 ఏప్రిల్ తర్వాత మావోయిస్టుల అతిపెద్ద దాడి ఇదే. 2021లో 22 మంది జవాన్లను చంపేశారు.

ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాలు ఇలా ఉన్నాయి. బస్తర్ రీజియన్‌లో దర్భా డివిజన్‌కు చెందిన మావోయిస్టులు పురు హిడ్మా రీజియన్‌లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో దంతేవాడ హెడ్‌క్వార్టర్స్ నుంచి సుమారు 200 మంది డీఆర్జీ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేయడానికి ఏప్రిల్ 25వ తేదీన రాత్రిపూట బయల్దేరి వెళ్లారు. బుధవారం ఉదయం నహది గ్రామంలో అర్ణపూర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఎన్‌కౌంటర్‌లోనే ఇద్దరు మావోయిస్టు క్యాడర్‌లను అరెస్టు చేశారు. మిగిలిన మావోయిస్టులు తప్పించుకున్నారు. చీకటి అడవిలో కలిసిపోయారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌ : మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి

భద్రతా బలగాలు ఆ ఇద్దరు మావోయిస్టులను తీసుకుని మళ్లీ దంతేవాడలోని బేస్‌కు బయల్దేరాయి. ఓ టీమ్ ప్రైవేట్ వెహికల్‌లో.. మిగిలినవారు ఎంయూవీల్లో బయల్దేరారు. ఒక్కో వాహనానికి 150 మీటర్ల దూరంతో ప్రయాణం చేస్తున్నారు. ఆ కాన్వాయ్ అర్ణపూర్, సమేలీ రూట్‌లో వారు ప్రయాణిస్తుండగా మావోయిస్టులు ఓ వాహనాన్ని పేల్చేశారు. ఆ ప్రైవేటు వాహనంలో స్థానిక డ్రైవర్‌తోపాటు పది మంది డీఆర్జీ జవాన్లూ ఉన్నారు.

50 కిలోల ఐఈడీని అక్కడ పాతిపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ పేలుడు ధాటికి మినీ గూడ్స్ వ్యాన్ ఎగిరిపడి తునాతునకలైంది. 20 అడుగుల దూరంలో పడిపోయింది. ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ 12 అడుగుల లోతు, 25 అడుగుల వెడల్పుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటన ఉదయం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది(దంతెవాడ నుంచి 45 కిలోమీటర్లు). ఎన్‌కౌంటర్ సైట్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులకు జవాన్లు వెళ్లుతున్న దారి గురించి ఇన్ఫార్మర్లు చెప్పి ఉంటారని భావిస్తున్నారు.

Also Read: బీజాపూర్ ఎన్కౌంటర్... 22మంది జవాన్లు మృతి, ఆచూకీ దొరకని 21మంది గల్లంతు

పేలుడు తర్వాత వెహికిల్‌లో నుంచి బయటపడ్డ జవాన్లపైనా మావోయిస్టులు కాల్పులు జరిపి ఉంటారని పోలీసు వర్గాలు చెప్పాయి. అప్పుడు కొద్ది మొత్తంలో కాల్పులు జరిపి.. పారిపోయారు.
ఆ ప్రైవేట్ వెహికల్ ఎగిరిపడగానే.. ఆ కాన్వాయ్‌లోని ఇతర వాహనాలు తమ సహచరులను కాపాడుకోవడానికి వెనక్కి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వీరు అక్కడికి వెళ్లేలోపే మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు.

ఆ మావోయిస్టులను పట్టుకోవడానికి భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. పేలుడు పదార్థం ఐఈడీని పేల్చడానికి ఉపయోగించిన ఓ పొడవైన వైర్‌ను పోలీసులు కనుగొన్నారు. 

మృతులను గుర్తించారు. హెడ్ కానిస్టేబుళ్లు జోగా సోది, మున్నారం కాడ్తి, సంతోష్ తామో, కాని్టేబళ్లు దుల్గో మాండవి, లక్ష్ము మార్కమ్, జోగా కావాసి, గోపానియా సైనికులు (అండర్ కవర్ ఆపరేటివ్స్) రాజు రామ్ కార్టమ్, జైరాం పోడియం, జగదీశ్ కావాసిలుగా గుర్తించారు. ఆ ప్రైవేట్ వెహికిల్ యజమాని, డ్రైవర్ ధనిరామ్ యాదవ్‌ మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఎక్కువ మంది దంతెవాడకు చెందినవారేనని భావిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios