తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భవనం శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఒక్కసారిగా నాలుగుఅంతస్థుల భవనం బుధవారంనాడు కుప్పకూలింది. భవనం రెనోవేషన్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద భవన నిర్మాణ కూలీలు చిక్కుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు అధికారులు.
బుధవారంనాడు చెన్నైలోని ప్యారీస్ కార్నర్ సమీపంలోని ఆర్మేనియన్ స్ట్రీట్ వద్ద నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. పునరుద్దరణ పనులు చేస్తున్న సమయంలో భవనం కుప్పకూలింది. భవనం శిధిలాల కింద నలుగురు కార్మికులు చిక్కుకుపోయారు. చెన్నైలోని ఉత్తరభాగంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ అధికారులు, పోలీసులు ఈ భవనంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. మరమ్మత్తు పనులు చేస్తున్న సమయంలో భవనం కుప్పకూలిందని చెన్నై కార్పోరేషన్ కమిషనర్ గంగదీప్ సింగ్ బేడీ చెప్పారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ తొలి ప్రాధాన్యత అని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. నాలుగు ఎక్స్‌కవేటర్లు, ఐదు అగ్నిమాపక దళాలతో కలిపి 50 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవన శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
