ప్రధాని నరేంద్ర మోడీ  101  మన్ కీ బాత్  కార్యక్రమంలో  ఇవాళ ప్రసంగించారు. పలు అంశాలపై  మోడీ  మాట్లాడారు.  ఎన్టీఆర్, వీరసావర్కర్లను  మోడీ గుర్తు  చేసుకున్నారు.  

న్యూఢిల్లీ:దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివారంనాడు మన్ కీ బాత్ 101 ఎపిసోడ్ లో ప్రధాని మోడీ ప్రసంగించారు.టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించారు. రాజకీయాలతో పాటు చిత్ర రంగంలో కూడ ఎన్టీఆర్ ఎంతో ప్రతిభ చూపారని ఆయన కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారన్నారు. తన నటనతో ఎన్టీఆర్ ఎన్నో చారిత్రక పాత్రలకు జీవం పోశారని ఆయన గుర్తు చేశారు. కోట్ల మంది హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 300 లకు పైగా చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రాముడు, కృష్ణుడు ప్రాతాల్లో ఎన్టీఆర్ నటనను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటారని ఆయన తెలిపారు. మరో వైపు వీర సావర్కర్ సేవల గురించి మోడీ ప్రస్తావించారు. స్వాతంత్ర ఉద్యమంలోనే కాదు సామాజిక సమానత్వం కోసం సావర్కర్ చేసిన సేవలు నేటికి గుర్తుండిపోతాయని మోడీ పేర్కొన్నారు. 


మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ వినేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిని చూపిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. న్యూజిలాండ్ లో వందేళ్ల వృద్దురాలు తన ఫోటోను ఆశీర్వదించారన్నారు.మన్ కీ బాత్ కార్యక్రమంపై విదేశాల్లో విశేష స్పందన వచ్చిందన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రజల నుండి నిర్మాణాత్మక సూచనలు, సలహలు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా వచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజల గురించి చర్చ జరుగుతుందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ నినాదాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని కోరారు. యువ సంగమం పేరుతో విద్యాశాఖ చేపట్టిన కార్యక్రమం గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు.

గత పదేళ్లలో భారతదేశంలో కొత్త మ్యూజియాలు, స్మారక చిహ్నాలను నిర్మించిన విషయాన్ని ప్రదాని గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల పోరాటాలను వివరించే పది కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రధాని వివరించారు. ఇండియన్ మెమరీ ప్రాజెక్టు 2010లో స్థాపించబడినట్టుగా మోడీ గుర్తు చేశారు. ఇది ఒక రకమైన ఆన్ లైన్ మ్యూజియంగా ఆయన పేర్కొన్నారు. 

దేశ వ్యాప్తంగా ఉన్న పలు మ్యూజియంల గురించి మోడీ ప్రస్తావించారు. గురుగ్రామ్ లో ఉన్న మ్యూజియంలో కెమెరాలున్నాయని ఆయన గుర్తు చేశారు. 
1860 తర్వాతి కాలంలోని 8 వేల కెమెరాలు ఈ మ్యూజియంలో ఉన్నాయని మోడీ చెప్పారు. తమిళనాడులోని మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్, ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం గురించి మోడీ వివరించారు. గత వారంలో తాను హిరోషిమా పర్యటన గురించి మోడీ ప్రస్తావించారు. హిరోషిమా పీస్ మెమోరియల్ ను తాను సందర్శించే అవకాశం దక్కిందన్నారు. ఇది ఒక భావోద్వేగ అనుభవంగా ఆయన పేర్కొన్నారు.