న్యూఢిల్లీ: దేశం కరోనాతో పాటు రెండు అతి పెద్ద తుఫాన్లు పలు రాష్ట్రాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.ఆదివారం నాడు  ఆయన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. కరోనా సెకండ్ వేవ్ లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ డిమాండ్ భారీగా పెరిగిందన్నారు. ఆక్సిజన్ సరఫరా తమకు పెద్ద సవాల్ గా మారిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.ఈ క్రమంలో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్, క్రయోజనిక్ ట్యాంకర్ల డ్రైవర్లు, ఎయిర్ ఫోర్స్ పైలెట్లు చేసిన కృషితో ఆక్సిజన్ కొరతను అధిగమించామన్నారు. ఆక్సిజన్ సరఫరాలో విశేష కృషి చేసిన డ్రైవర్ల పేర్లను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

విదేశాల నుండి క్రయోజనిక్ ట్యాంకర్లు, కాన్సంట్రేటర్లు దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగా కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో గతంలో రోజుకు 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం 9500 మెట్రిక్ టన్నుకు పెంచామని మోడీ వివరించారు. గతంలో కంటే 10 రెట్లు ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగిందని ఆయన తెలిపారు.

కరోనాపై పోరాడుతున్న సమయంలో దేశంపై టౌటే, యాస్ తుఫాన్ లు విరుచుకుపడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయినా కూడ ప్రజలు ఈ విపత్తులను ధైర్యంగా ఎదుర్కొన్నారని ఆయన చెప్పారు. కరోనా అన్ని రంగాలను దెబ్బతీసిందన్నారు. అయితే ఇలాంటి సంక్షోభ సమయంలో వ్యవసాయరంగం పురోగతి సాధించిందని ఆయన చెప్పారు. మరో వైపు దేశ భద్రత విసయంలో రాజీలేకుండా ముందుకు సాగుతున్నట్టుగా తెలిపారు.