ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీశ్ సిసోడియాకు ప్రత్యక్ష పాత్ర ఉన్నదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని వివరించింది. కొందరు వ్యక్తులు లబ్ది పొందేలా ఈ పాలసీని రూపొందించారని ఆరోపించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీశ్ సిసోడియాకు ప్రత్యక్ష పాత్ర ఉన్నదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు ఢిల్లీ కోర్టుకు తెలిపింది. మనీశ్ సిసోడియా చేసుకున్న బెయిల్ దరఖాస్తు పై ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు వాదనలు విన్నది. ఈ విచారణ జరుగుతుండగా కోర్టులో ఈడీ పై వ్యాఖ్యలు చేసింది.
ఈ పాలసీ ద్వారా కొందరు వ్యక్తులు లబ్ది పొందేలా రూపొందించారని, అందుకే నిపుణుల కమిటీ అభిప్రాయాలనూ స్వీకరించకుండానే పాలసీ రూపొందించారని ఈడీ తెలిపింది. ఎంపిక చేసుకున్న కొందరు హోల్ సేలర్లు 12 శాతం మార్జిన్ ప్రాఫిట్ పొందేలా ఈ లిక్కర్ పాలసీని ఫ్రేమ్ చేశారని ఆరోపించింది. వాస్తవానికి ఇది ఆరు శాతం మాత్రమే ఉండాలని వివరించింది.
పాలసీకి వ్యతిరేకంగా ప్రాఫిట్ మార్జిన్‌ను 12 శాతంగా ఉంచారని ఈడీ తెలిపింది. ఈ నిర్ణయాన్ని మనీశ్ సిసోడియా ఆదేశాలతోనే తీసుకున్నారని చెప్పడానికి ప్రూఫ్ ఉన్నదని వివరించింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు లబ్ది పొందేలా మనీశ్ సిసోడియా ఒత్తిడితోనే పాలసీని డైల్యూట్ చేశారని తెలిపింది. ఆ మార్పులే కొందరు లబ్ది పొందేలా దోహదపడ్డాయని పేర్కొంది.
Also Read: నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది అరవింద్ కేజ్రీవాల్: ఆర్థిక నేరస్తుడు సుకేశ్ సంచలన కామెంట్
మంత్రివర్గం చర్చించనివి కూడా కొన్ని విషయాలు ఆ పాలసీలో ఉన్నాయని కోర్టుకు ఈడీ తెలిపింది. అయినా.. ఆ పాలసీని ఆమోదించి అమలు చేశారని వివరించింది. ఈ సందర్భంగా ఈడీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ వ్యాఖ్యలను కోట్ చేసింది. మంత్రివర్గం పలురకాల డేటాను కోరిందని, కానీ, వాటిపై చర్చించలేదని వివరించింది.
అంతేకాదు, ఈ దర్యాప్తులో మనీశ్ సిసోడియా సహకరించలేదని కోర్టుకు ఈడీ తెలిపింది.
మనీశ్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు లో మనీలాండరింగ్ ఆరోపణలతో గురువారం ఈడీ ఆయనను అరెస్టు చేసింది. మనీశ్ సిసోడియాను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో రేపు ప్రశ్నలు ఎదుర్కోనున్నారు.
