మళ్లీ అట్టుడుకుతున్న మణిపూర్.. తాజా హింసలో ముగ్గురు మృతి
Manipur violence: మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగుతోంది. కాంగ్ పోక్పి జిల్లాలో జరిగిన హింసలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కుకి-జోమి కమ్యూనిటీకి చెందిన ముగ్గురు గ్రామస్థులు వాహనంలో ప్రయాణిస్తుండగా కాంగ్‌పోక్పి జిల్లాలోని ఇరెంగ్ నాగా గ్రామ సమీపంలో దాడి జరిగింది.

Manipur fresh violence: మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగుతోంది. కాంగ్ పోక్పి జిల్లాలో జరిగిన హింసలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కుకి-జోమి కమ్యూనిటీకి చెందిన ముగ్గురు గ్రామస్థులు వాహనంలో ప్రయాణిస్తుండగా కాంగ్‌పోక్పి జిల్లాలోని ఇరెంగ్ నాగా గ్రామ సమీపంలో దాడి జరిగింది. అప్రమత్తమైన భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మే 3న మణిపూర్ లో కూకీ, మైతీ వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు, జాతి హింస చెలరేగడంతో ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకెళ్తే.. మణిపూర్ లోని కాంగ్ పోక్పి జిల్లాలో వారం రోజుల వ్యవధిలో జరిగిన హింసాకాండలో సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని కంగూయి ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో మోహరించిన భద్రతా దళాలు అనుమానితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. వాహనంలో వెళ్తున్న ముగ్గురు కుకీ వ్యక్తులను సాయుధ దుండగులు అడ్డగించి కాల్చిచంపడంతో ఈ ఘటన జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ ధృవీకరించారు. 'కొన్ని రిపోర్టుల్లో పేర్కొన్నట్లుగా కాల్పులు జరగలేదు. బాధ్యులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించాం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించాం' అని రాకీ తెలిపారు.
ఇంఫాల్ వెస్ట్, కాంగ్ పోక్పి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఈ దాడి జరిగిందనీ, నిందితులు ఆ ప్రాంతం నుంచి వాహనంలో పారిపోయినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, అస్సాం రైఫిల్స్ బలగాలు చేరుకున్నాయి. భద్రత బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని ఈ కేసు గురించి తెలిసిన మరో అధికారి తెలిపారు. మృతులను కుకి గొడుగు సమూహమైన ఇండిజెనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం కు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ముగ్గురు కుకి-జో నివాసితులని, సాయుధ దుండగులు సైనిక దుస్తులు ధరించారని గిరిజన ఐక్యత కమిటీ (సీఓటీయూ) ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా సిబ్బంది వేషధారణలో, హింసకు ఆజ్యం పోసేందుకు పోలీసులు, భద్రతా దళాల యూనిఫాంలను సమకూర్చుకున్న దుండగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సంస్థలు మణిపూర్ పోలీసులను హెచ్చరించాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.