Asianet News TeluguAsianet News Telugu

మణిపూర్ ఘటనపై చర్చకు విపక్షాల పట్టు.. రాజ్యసభలో గందరగోళం.. సభ వాయిదా..

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే రాజ్యసభలో మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

Rajya Sabha adjourned till 2 PM after uproar by opposition members demanding discussion on Manipur situation ksm
Author
First Published Jul 20, 2023, 12:48 PM IST

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మే 4వ తేదీన జరిగినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో రాజస్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగా.. జూన్‌లో మరణించిన సిట్టింగ్ ఎంపీ హరద్వార్ దూబేకి నివాళిగా సభను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 

అయితే తిరిగి 12 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని విపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ చైర్మన్ సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టుగా  ప్రకటించారు. మరోవైపు పార్లమెంట్ వెలుపల కూడా మణిపూర్ ఘటనపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. 

రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలపై సభాపక్ష నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్షాల తీరు చూస్తుంటే పార్లమెంట్‌ను నడపకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోందని.. మణిపూర్ ఘటనలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసినా కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి’’ అని చెప్పారు. 

ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం తమ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని మల్లికార్జున్‌ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ హింస అంశాన్ని లేవనెత్తాలని, ఈశాన్య రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేయాలని నాయకులు నిర్ణయించారు. తమ కూటమి 'INDIA' ఏర్పడిన తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహంపై విపక్ష పార్టీల తొలి సమావేశం ఇది.

మణిపూర్‌పై చర్చ చేపట్టాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. మణిపూర్ హింసపై ప్రభుత్వం నుండి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ అంశంపై వాయిదా నోటీసు ఇచ్చారు. దాదాపు 80 రోజులు కావస్తున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో పర్యటించలేదని, అక్కడి పరిస్థితులపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

‘‘మేము మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతాము. ఈ అంశాన్ని లేవనెత్తడానికి రాజ్యసభలో నోటీసు కూడా ఇచ్చాను. దానిని లేవనెత్తడానికి మాకు ఛైర్మన్ అనుమతిస్తారో లేదో మేము చూస్తాము’’ అని మల్లికార్జున ఖర్గే విలేకరులతో అన్నారు. ‘‘ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ సందర్శించడానికి సమయం ఉంది. 38 పార్టీలకు (ఎన్‌డీఏ సమావేశానికి) పిలవడానికి అతనికి సమయం ఉంది. కానీ తన వద్ద అన్ని వనరులు ఉన్నప్పటికీ మణిపూర్‌లో పర్యటించడానికి సమయం లేదు’’ అని మోదీని ఖర్గే విమర్శించారు. ఇక, మే 3న మణిపూర్‌లో జాతుల మధ్య హింస చెలరేగినప్పటి నుంచి మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మౌనం వహించడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios