మణిపూర్‌లో హింసాకాండపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఒక తల్లిగా వారి బాధలను అర్థం చేసుకోగలను అని అన్నారు. సోదరులుగా శాంతి సామరస్యంగా నివసించిన ప్రజలు ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం చూస్తే గుండె పగిలిపోతున్నదని వివరించారు. 

న్యూఢిల్లీ: మణిపూర్ మే 3వ తేదీ నుంచి జరుగుతన్న హింసాకాండలో మరణించిన వారికి సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ‘తమ ఆప్తులను కోల్పోయిన మణిపూర్ వాసులందరికీ నా సానుభూతి. ఉన్న ఇంటిని వదిలి పారిపోయేలా బలవంతపెట్టిన పరిస్థితులు, తమ జీవిత కాలమంతా కష్టపడి నిర్మించికున్నవాటిని వదిలి వెళ్లిపోయేలా చేసిన పరిస్థితులపై బాధపడుతున్నాను.’ అని సోనియా గాంధీ వీడియో మెస్సేజీలో తెలిపారు.

మణిపూర్‌లో తెగల మధ్య హింసాత్మక ఘర్షణను మానవ విషాదంగా ఆమె వర్ణించింది. ఆ రాష్ట్రంలో సోదరాభావంతో నివసించిన వారు ఇప్పుడు ఒకరికి మరొకరు శత్రువుగా మారడాన్ని చూస్తే గుండె పగిలిపోతున్నదని అన్నారు.

‘సుమారు 50 రోజులుగా మణిపూర్‌లో గొప్ప మానవ విషాదాన్ని చూస్తున్నాం. మణిపూర్‌లో కనీవినీ ఎరుగని రీతిలో హింస జరుగుతున్నది. ఇది వేలాది మంది జీవితాలను వేళ్ల నుంచి పెకిలించివేస్తున్నది. ఇది దేశ అంతరాత్మను లోతుగా గాయపరించింది.’ అని ఆమె చెప్పారు.

Scroll to load tweet…

శాంతియుతంగా కలిసి మెలిసి ఉన్న సోదరులు, సోదరీమణులు కొట్లాడుకోవడం హృదయాన్ని ద్రవీభవిస్తున్నదని పేర్కొన్నారు. సోదరాభావం కోసం అచంచల విశ్వాసం, సహృదయం అవసరం అవుతాయని, ఒక్క తప్పుడు నిర్ణయంతో ద్వేషం, విభజన పెచ్చరిల్లుతుందని వివరించారు. 

Also Read: మణిపూర్‌లో పోలీసుల కాల్పుల్లో 40 మంది తిరుగుబాటుదారులు హతం: సీఎం బీరెన్ సింగ్.. ‘కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు’

‘నేడు దేశం ఒక కీలకమైన చౌరస్తాలో నిలబడింది. గాయాలను మాన్పి పిల్లల ఉజ్వల భవిష్యత్‌ను అందించే దారిని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మణిపూర్ ప్రజలకు ముఖ్యంగా ధైర్యవంతులైన సోదరీమణులకు నేను చేసే అప్పీల్ ఒక్కటే. సుందరమైన ఆ భూమిపై మళ్లీ శాంతి, సామరస్యాన్ని తీసుకురండి’ అని సోనియా గాంధీ తెలిపారు.

‘ఒక తల్లిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీ మంచి మనస్సు సరైన దారినే చూపిస్తాయని ఆశిస్తున్నాను. రానున్న వారాలు, నెలల్లో మళ్లీ విశ్వాస వంతెనను నిర్మించి సుదీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాను. నాకు మణిపూర్ ప్రజలపై అమితమైన నమ్మకం ఉన్నది. నాకు తెలుసు మనం కలిసి చేస్తే ఈ బాధాతప్త కాలాన్ని అధిగమించగలం’ అని వివరించారు.