Asianet News TeluguAsianet News Telugu

మణిపూర్‌లో పోలీసుల కాల్పుల్లో 40 మంది తిరుగుబాటుదారులు హతం: సీఎం బీరెన్ సింగ్.. ‘కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు’

మణిపూర్‌లో హింస చెలరేగుతూనే ఉన్నది. ఈ సారి కుకి తిరుగుబాటుదారులకు పోలీసులకు మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆదివారం ఒక్క రోజే రాష్ట్రంలో అరడజను ప్రాంతాల్లో దాడులు జరిగాయి. పోలీసుల ఎన్‌కౌంటర్‌లలో సుమారు 40 మంది టెర్రరిస్టులు మరణించినట్టు సీఎం బీరెన్ సింగ్ తెలిపారు.
 

40 insurgents shot dead in police encounters in manipur cm biren singh says kms
Author
First Published May 28, 2023, 6:31 PM IST

Manipur Ethnic Clashes: మణిపూర్‌లో మైతేయి, కుకి తెగల మధ్య రాజుకున్న మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఆదివారం కనీసం అరడజను చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఆయుధాలు చేతబట్టిన వారి నుంచి వాటిని తీసుకెళ్లాలని ఆర్మీ, పోలీసులు ఓ ఆపరేషన్ చేస్తున్నట్టు పీటీఐ న్యూస్ ఏజెన్సీ ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే తిరుగుబాటుదారులు(కుకీలు?), పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్లు జరిగినట్టు తెలిసింది. సీఎం బీరెన్ సింగ్ ఈ ఎన్‌కౌంటర్ల గురించి కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లలో సుమారు 40 మంది టెర్రరిస్టులు మరణించినట్టు తనకు సమాచారం అందిందని చెప్పారు.

టెర్రరిస్టులు M-16, AK-47 అసాల్ట్ రైఫిళ్లు, స్నైపర్ గన్‌లు కలిగి ఉన్నారని, వారు సాధారణ పౌరులపైకి కాల్పులు జరుపుతున్నారని సీఎం బీరెన్ సింగ్ ఈ రోజు విలేకరులకు తెలిపారు. వారు చాలా గ్రామాల్లోకి చొరబడ్డి ఇళ్లను తగులబెట్టారని వివరించారు. వారిపై తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్మీ, ఇతర సాయుధ బలగాల సహాయంతో వారిపై పోరాడుతున్నామని తెలిపారు. సుమారు 40 మంది టెర్రరిస్టులు ఎన్‌కౌంటర్‌లలో తూటాలకు మరణించినట్టు తమకు రిపోర్టులు అందాయని వివరించారు.

మణిపూర్‌ను ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్న టెర్రరిస్టులకు, కేంద్రం మద్దతుతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పోరు జరుగుతున్నదని సీఎం బీరెన్ సింగ్ అన్నారు. ఈ రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంఫాల్ లోయ సమీపంలో ఐదు ఏరియాల్లో తిరుగుబాటుదారులు దాడులు చేశారని కొన్ని వర్గాలు వివరించాయి. సెక్మాయ్, సుగ్ను, కుంబి, ఫయెంగ్, సెరోయులలో ఈ దాడులు జరిగాయని తెలిపాయి. పలు వీధుల్లో ఎవరికీ తెలియని డెడ్ బాడీలు పడి ఉన్నాయని పేర్కొన్నాయి. సెక్మాయ్‌లో గన్ ఫైట్ చోటుచేసుకుందని, అది పూర్తయిందన్న ఆ వర్గాలు మరింత వివరాలను అందించలేవు.

ఫయెంగ్‌లో గన్ ఫైట్‌లో గాయపడ్డ పది మంది రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేరినట్టు వైద్యులు ఫోన్ ద్వారా ఎన్డీటీవీకి తెలిపారు.

27 ఏళ్ల రైతు ఖుమంథెమ్ కెన్నెడి పలు బుల్లెట్‌లు తాకి చాందొంపోపక్కిలోని బిషెన్‌పూర్‌లో మరణించాడు. ఆయన డెడ్ బాడీని రిమ్స్‌కు తరలిస్తున్నట్టు కొన్ని వర్గాలు వివరించాయి. మరింత మంది మరణించి ఉంటారనే ఆందోళన వ్యక్తం చేశాయి. 

ఇంఫాల్ వ్యాలీ శివారులో గత రెండు రోజులుగా జరుగుతున్న హింసాత్మక దాడులు ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసినట్టుగా తెలుస్తున్నదని సీఎం బీరెన్ సింగ్ అన్నారు. అదీ పీస్ మిషన్ పై కేంద్ర మంత్రి నిత్యానాంద్ రాయ్ మణిపూర్‌లో ఉన్న సమయంలో జరగడం విషాదకరం అని పేర్కొన్నారు. 

Also Read: కొత్త పార్లమెంటు ప్రారంభం.. మరి పాత పార్లమెంటు భవనాన్ని ఏం చేస్తారు?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సుమారు 25 కుకి తిరుగుబాటు సంస్థలు ఆపరేషన్‌లేవీ చేపట్టబోమని అంగీకారానికి వచ్చాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం తిరుగుబాటుదారులను ప్రభుత్వం గుర్తించిన క్యాంపుల్లో ఉంచుతారు (బంధిస్తారు!). వారి వద్ద నుంచి ఆయుధాలు లాక్కొని రెగ్యులర్‌గా మానిటర్ చేస్తున్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు మణిపూర్ పర్యటించనున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మైతేయి, కుకీలు శాంతియుతంగా మెలగాలని సూచనలు చేశారు.

ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రెండు రోజులు పర్యటించి భద్రతా పరిస్థితులను రివ్యూ చేయడానికి నిన్న మణిపూర్‌కు వచ్చారు.

మైతేయీలకు ఎస్టీ హోదా ఇవ్వాలనే నిర్ణయం తక్షణ కారణమైనప్పటికీ భూములపై హక్కు, ప్రాబల్యం వంటి ఇతర కారణాలూ ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే కుకిలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నట్టు అర్థమవుతున్నది. మైతేయీలు రాజధాని నగరం ఇంఫాల్‌లో అధికంగా ఉంటారు. కుకి తెగలు కొండ ప్రాంతాల్లో నివసిస్తాయి. 

ఈ రాష్ట్రంలో ఉండే నాగాలు, కుకిలు ఎస్టీ కేటగిరీలో ఉంటారు. 

ఇక్కడ కుకి తెగకు, మైతేయీలకు మాత్రమే ఘర్షణలు జరుగుతున్నాయి. నాగాలకు అందులో ప్రమేయం లేకపోవడం గమనార్హం.

పొరుగు రాష్ట్రంలో నాగాలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. మణిపూర్‌లోనూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నదనే విషయం తెలిసిందే.

మణిపూర్‌లో గత 25 రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. తాజాగా ఈ నెలాఖరు వరకు అంతర్జాల సేవలపై ఆంక్షలు విధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios