మణిపూర్ లో చోటు చేసుకుంటున్న అల్లర్లలో విదేశీ హస్తం ఉండొచ్చని ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఉండాలని, శాంతి పాటించాలని విజ్ఞప్తి చేశారు.
మణిపూర్ లో పలువురి ప్రాణాలను బలిగొన్న జాతి హింసలో బాహ్య శక్తుల హస్తం ఉండవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అన్నారు. వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మణిపూర్ మయన్మార్ తో బార్డర్ ఉంది. దీనికి సమీపంలోనే చైనా కూడా ఉంది. మన సరిహద్దుల్లో 398 కిలోమీటర్లు సున్నితమైనవి, రక్షణ లేనివి ఉన్నాయి. మన సరిహద్దుల్లో భద్రతా దళాలు మోహరించాయి, కానీ పటిష్టమైన, విస్తృతమైన భద్రతా మోహరింపు కూడా ఇంత విస్తారమైన ప్రాంతాన్ని కవర్ చేయదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ముందస్తు ప్రణాళికతో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ కారణం స్పష్టంగా తెలియడం లేదు’’ అని అన్నారు.
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన.. మరో 13 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన సిబ్బంది
మణిపూర్ లో శాంతి నెలకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని బీరెన్ సింగ్ అన్నారు. కుకీ సోదరసోదరీమణులతో ఫోన్ లో తాను మాట్లాడానని, క్షమించి మరిచిపోదామని చెప్పానని చెప్పారు. శాంతి పునరుద్ధరణకు అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ‘‘కొన్ని గంటల క్రితం నేను మా కుకి సోదర సోదరీమణులతో టెలిఫోన్ లో మాట్లాడాను. క్షమించండి, మరచిపోదాం, ఎప్పటిలాగే కలిసిమెలిసి జీవిద్దాం’’ అని సూచించానని తెలిపారు.
‘‘మయన్మార్ కల్లోలం నేపథ్యంలో బయటి నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ చేసి, పరిస్థితి చక్కబడిన తర్వాత వెనక్కి పంపించేందుకు మాత్రమే ప్రభుత్వం ప్రయత్నించింది. మణిపూర్ లో శాంతిని, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడమే మా ప్రాధాన్యం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్ర ప్రజలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేసిన బీరెన్ సింగ్, అన్ని తెగలు కలిసి జీవించాలని, మణిపూర్ ను జాతి ప్రాతిపదికన చీల్చడానికి తాను అనుమతించబోనని అన్నారు.
‘‘మనం ఒక్కటే. మణిపూర్ చిన్న రాష్ట్రమే అయినా మన దగ్గర 34 తెగలు ఉన్నాయి. ఈ 34 తెగలు కలిసి జీవించాలి. బయటి నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ స్థిరపడకుండా జాగ్రత్త పడాలి. జనాభా అసమతుల్యత లేకుండా చూసుకోవాలి. మణిపూర్ విడిపోవడానికి నేను అనుమతించను. రాష్ట్రంలో ప్రత్యేక పరిపాలనా అధికారం కూడా ఉండబోదని సీఎంగా హామీ ఇస్తున్నాను. అందర్నీ కలుపుకొని పోవడానికి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని సీఎం అన్నారు.
ట్విట్టర్ యూజర్లకు షాక్.. చదివే పోస్టులపై పరిమితులు విధించిన ఎలాన్ మస్క్.. ఎవరెవరికీ ఎంతంటే ?
కాగా.. మే 3న మీటీలను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్ యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో హింస చెలరేగింది. మెయిటీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు - నాగాలు, కుకిలు - జనాభాలో మరో 40 శాతం మంది ఉన్నారు. కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.
