Manipur Assembly Election 2022: మణిపూర్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Manipur Assembly Election 2022: మణిపూర్ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటివరకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ.. ముమ్మర ప్రణాళికలతో ప్రచారం సాగిస్తూ.. ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే శనివారం నాడు రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
వివరాల్లోకెళ్తే.. మణిపూర్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి దశలో ఫిబ్రవరి 28న పోలింగ్ జరిగిన ఐదు నియోజకవర్గాల్లోని 12 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ కూడా జరుగుతోంది. ఎటువంటి విరామం లేకుండా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 4,28,679 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్‌జెండర్లతో సహా మొత్తం 8,38,730 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఆరు ఎలక్టోరల్ జిల్లాల్లోని 1,247 పోలింగ్ స్టేషన్‌లలో వినియోగించుకోనున్నారు. ఆ ప్రాంతాల్లో తౌబల్, జిరిబామ్, చందేల్, ఉఖ్రుల్, సేనాపతి, తమెంగ్‌లాంగ్ లు ఉన్నాయి.
శనివారం జరిగే ఓటింగ్ లో కీలక నేతలు తమ ఆదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నారు. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబిసింగ్, ఆయన కుమారుడు సూరజ్ కుమార్, మాజీ ఉపముఖ్యమంత్రి గైఖాంగమ్ వంటి ప్రముఖులతోపాటు బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ 18, జేడీయూ, నాగా పీపుల్స్ ఫ్రంట్ చెరో పది మంది, నేషనల్ పీపుల్స్ పార్టీ 11 మంది, శివసేన, ఎన్‌సీపీ ఇద్దరు చొప్పున, ఆర్‌పీఐఏ నుంచి ముగ్గురు, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు రెండో విడుత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 28న 38 స్థానాలకు మొదటి విడుత ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక శనివారం నాడు కీలకమైన 22 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్, సామాజిక దూరం మరియు థర్మల్ స్క్రీనింగ్‌తో సహా ఓటర్ల కోసం కోవిడ్-19 ప్రోటోకాల్‌లు నిర్వహించబడుతున్నాయి.
పోలింగ్ నేపథ్యంలో మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఓక్రమ్ ఇబోబి సింగ్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. సింగ్ తౌబాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఓటు వేసే సమయంలో కొంత ఆలస్యమైంది. ఈ క్రమంలోనే ఆయన పోలింగ్ లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని ఆయన అన్నారు.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మణిపూర్‌లోని పార్లోన్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి ఓటర్లు కోవిడ్-19 ప్రోటోకాల్‌లను అనుసరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ క్యూలలో నిలబడి ఉన్నారు.
