Viral: గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మాయి వేషంలో పరీక్ష రాయడానికి వెళ్లి.. ‘అరరే.. అంతా సరిగానే మేనేజ్ చేశానే..’
పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఆమె పరీక్ష రాయడానికి ఎగ్జామ్ సెంటర్ వెళ్లాడు. లిప్ స్టిక్, బొట్టు, గాజులు అన్నీ సింగారించుకున్నాడు. ఆడ వేషంలో పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. కానీ, బయోమెట్రిక్‌లో దొరికి కటకటాలపాలయ్యాడు.
గర్ల్ ఫ్రెండ్ కోసం ఏదైనా చేసి పెడతానని ఆ యువకుడు మాట జారాడు. తన పరీక్ష రాయాలని ఆమె కోరింది. దీంతో ఆ యువకుడు ఏకంగా అమ్మాయి అవతారం ఎత్తాడు. ఎక్కడా దొరకొద్దని పకడ్బందీగా ప్లాన్ వేశాడు. అమ్మాయిల డ్రెస్ ధరించి బొట్టు, గాజులు, లిప్ స్టిక్‌లతో సింగారించుకున్నాడు. ఆయన అమ్మాయి వేషంలో ఉన్న నకిలీ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు కూడా తయారు చేసుకున్నాడు. అంతా ఓకే అనుకున్నాక ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ అన్నీ సరిగానే మేనేజ్ చేసినా.. బయోమెట్రిక్ వద్ద దొరక్కతప్పలేదు. ఈ ఘటన పంజాబ్‌లోని ఫరీద్ కోట్‌లో చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పరీక్షలో ఈ ఘటన జరిగింది. ఈ యూనివర్సిటీ జనవరి 7వ తేదీన మల్టి పర్పస్ హెల్త్ వర్కర్స్ ఎగ్జామ్ నిర్వహించింది. ఇందుకోసం పరమ్ జీత్ కౌర్ అనే యువతి అప్లై చేసుకుంది. కానీ, ఆమె స్థానంలో పరీక్ష రాయడానికి ఆమె బాయ్‌ఫ్రెండ్ అంగ్రేజ్ సింగ్ వెళ్లాలని అనుకున్నాడు. అందుకోసం ముందస్తు కసరత్తులు చాలానే చేశాడు. ఎవరూ గుర్తు పట్టకుండా తన డ్రెస్సింగ్, మేకప్ మొత్తంగా మార్చుకున్నాడు. అమ్మాయి అవతారం ఎత్తాడు. అంతేకాదు, అమ్మాయి వేషంలో ఉన్న తన ఫొటోలతో నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేసుకున్నాడు.
Also Read: YS Sharmila: ఏపీపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రాజీనామా.. రెండు రోజుల్లో షర్మిలకు పగ్గాలు!
ఆ ఎగ్జామ్ సెంటర్‌లో అప్పటి వరకు అంగ్రేజ్ సింగ్‌ను ఎవరూ గుర్తు పట్టలేదు. అన్నీ డాక్యుమెంట్లు సరిగానే ఉన్నట్టుగా కనిపించాయి. కానీ, బయోమెట్రిక్ వద్ద కథ అడ్డం తిరిగింది. అక్కడ దరఖాస్తు చేసినప్పుడు ఉన్న వేలి ముద్రలతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి వేలి ముద్రలు సరిపోలేవు. దీంతో అనుమానంతో ఆరా తీయగా అసలు కథ బయటికి వచ్చింది. అసలు అభ్యర్థి అమ్మాయి అయితే.. పరీక్ష రాయడానికి వచ్చింది అబ్బాయి అని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. అంగ్రేజ్ సింగ్‌ను పోలీసులకు అప్పగించారు. అంగ్రేజ్ సింగ్ పై కేసు ఫైల్ అయింది.