YS Sharmila: ఏపీపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రాజీనామా.. రెండు రోజుల్లో షర్మిలకు పగ్గాలు!
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచనల మేరకు ఆయన ఈ రాజీనామా చేశారు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో వైఎస్ షర్మిలకు ఈ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తున్నది.
AP Congress: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. దీంతో వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయింది. ఒకటి లేదా రెండు రోజుల్లో వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీపీసీసీ చీఫ్ పగ్గాలు అందుకోబోతున్నారు.
వైఎస్ షర్మిలకు ఏపీపీసీసీ చీఫ్ పదవి అప్పగించే కార్యక్రమంలో భాగంగానే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచనల మేరకు గిడుగు రుద్రరాజు తన బాధ్యతలకు రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరడాన్ని గిడుగు రుద్రరాజు కూడా స్వాగతించిన సంగతి తెలిసిందే.
Also Read: Top Stories: రాహుల్ యాత్ర షురూ.. షర్మిలకు పీసీసీ పగ్గాలు!.. ఎమ్మెల్సీలుగా అద్దంకి, మహేశ్?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతోపాటు వైఎస్ షర్మిల కూడా భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మణిపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమెకు అగ్రనేతలు కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లు త్వరలోనే ఆమెకు పీసీసీ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సూత్రప్రాయంగా తెలియజేసినట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత ఆమెకు ఏపీపీసీసీ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, 17వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందే షర్మిల పీసీసీ పగ్గాలు తీసుకునే అవకాశం ఉన్నది. దీంతో మరో ఒకటి లేదా రెండు రోజుల్లోనే వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అందజేయడం ఖాయంగా కనిపిస్తున్నది.